వ్యోమనౌకలకు ‘మైక్రోవేవ్’ ఇంధనం!

5 Aug, 2014 03:15 IST|Sakshi
వ్యోమనౌకలకు ‘మైక్రోవేవ్’ ఇంధనం!

వాషింగ్టన్: అంతరిక్షంలో వ్యోమనౌకలు దూసుకుపోతున్నాయి.. చంద్రుడి మీదకి, భూమి మీదకి వస్తూ, వెళుతున్నాయి.. కానీ వాటి నుంచి ఎలాంటి శబ్దం లేదు.. మంటలు, పొగ, ఉష్ణం వంటివేవీ విడుదల కావడం లేదు.. అసలు వాటిలో ఇంధనమే లేదు.. ఇదేంటి? ఆ వ్యోమనౌకలు ఎలా ప్రయాణిస్తాయని అంటారా? కేవలం ‘మైక్రో తరంగాలు’.. అంటే రేడియోల్లో కార్యక్రమాలను ప్రసారం చేయడానికి వినియోగించే తరంగాలు! ఈ మైక్రో తరంగాలను వినియోగించి వ్యోమనౌకలకు శక్తినిచ్చే ఇంజన్ డిజైన్‌ను నాసా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఒక ప్రత్యేకమైన చాంబర్‌లోకి మైక్రో తరంగాలను ప్రయోగిస్తే... అవి అందులోని అన్ని అంచుల మధ్య బంతిలా అటూ ఇటూ పరావర్తనం చెందడంతో శక్తి ఉత్పన్నమవుతుంది.
 
  దీనిని ‘మైక్రోవేవ్ థ్రస్టర్ సిస్టమ్’గా పేర్కొంటున్నారు. ఇందులో మైక్రో తరంగాలను ఉత్పత్తి చేయడం కోసం సౌరశక్తిని వినియోగిస్తారు. దీనివల్ల ఎలాంటి సాంప్రదాయ ఇంధనాలూ అవసరం లేకుండా వ్యోమనౌకలు పనిచేస్తాయి. కృత్రిమ ఉపగ్రహాలు కక్ష్యలోనే ఉండేలా నియంత్రించేందుకు, గ్రహాంతర ప్రయాణాలకు ఈ టెక్నాలజీ అద్భుతంగా పనిచేస్తుందని నాసా శాస్త్రవేత్తలంటున్నారు. అన్నింటికన్నా విశేషం ఏమిటంటే.. 14 ఏళ్ల కిందటే 2000వ సంవత్సరంలో రోజర్ షాయర్ అనే శాస్త్రవేత్త ‘ఎమ్‌డ్రైవ్’ పేరుతో ఇదే తరహా ఇంజన్ నమూనాను రూపొందించారు. కానీ అది పనికిరాని పరిశోధన అంటూ.. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కొట్టిపారేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు