ఆ చిన్నారులకు జాతీయత చిక్కు!

18 Feb, 2018 02:56 IST|Sakshi

     కువైట్‌లో జన్మించి ఏ దేశ గుర్తింపు లేని వారు 150 మంది 

     అందరూ భారత సంతతి వారే.. 

     చిన్నారులను పట్టించుకోని విదేశాంగ శాఖ 

     క్షమాభిక్షకు గడువు ఐదు రోజులే.. 

మోర్తాడ్‌ (బాల్కొండ): కువైట్‌లోని భారత సంతతి చిన్నారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చిన్నారుల తల్లిదండ్రులు స్వదేశానికి వచ్చేందుకు కువైట్‌లోని రాయబార కార్యాలయం నుంచి ఔట్‌పాస్‌లు పొందినా ఆ చిన్నారులకు మాత్రం సాంకేతిక కారణాలు అడ్డొస్తున్నాయి. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఆస్పత్రులలో ప్రసవిస్తే ఆ ఖర్చు భరించే శక్తి  లేక  ఎంతో మంది కువైట్‌లో హోం డెలివరీకి ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు అదే చిన్నారులకు ఏ జాతీయత వర్తించకపోవడంతో వారిని స్టేట్‌లెస్‌ చిల్డ్రన్‌గా పరిగణిస్తున్నారు. దాదాపు 150 మంది చిన్నారులు మన దేశ సంతతివారు ఉన్నారు.

పిల్లలను వదిలిపెట్టి రాలేక, నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉండలేక తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కడప జిల్లాకు చెందిన రెడ్డిబాలు దుర్గయ్య, లక్ష్మీదేవి దంపతులు మొదట కంపెనీ వీసాలపైనే కువైట్‌ వెళ్లారు. వీరికి ఏడేళ్ల కూతురు భాగ్యశ్రీ (7), కుమారుడు బాలు(5) ఉన్నారు. క్షమాభిక్ష వల్ల వీరికి మనదేశ రాయబార కార్యాలయం నుంచి ఔట్‌పాస్‌లు జారీ అయ్యాయి. వీరి పిల్లలకు మాత్రం జనన ధ్రువీకరణ పత్రాలు లేని కారణంగా ఔట్‌పాస్‌లు జారీ కాలేదు. క్షమాభిక్షకు గడువు మరో ఐదు రోజులే ఉంది. వీరిద్దరు స్వదేశానికి వస్తే చిన్నారుల పరిస్థితి ఏమిటనే సందేహం వ్యక్తమవుతోంది. పిల్లల కోసం అక్కడే ఉంటే జైలు శిక్షను అనుభవించాల్సిన పరి స్థితి ఏర్పడుతోంది. దీంతో చిన్నారులను వదిలి రావాలా లేక కువైట్‌లోనే ఉండాలా అని వారు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టంగుటూరి లక్ష్మీనర్సమ్మ పిల్లలు శిశుకుమార్‌(6), ధనలక్ష్మిలకు ఔట్‌పాస్‌లు జారీ కాలేదు. ఇలా ఎంతోమంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఔట్‌పాస్‌లను జారీ చేయాలంటూ మన విదేశాంగ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. 

మా మనుమలు, మనమరాండ్లే గుర్తుకు వస్తున్నారు 
కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఔట్‌పాస్‌ల కోసం తమ తల్లిదండ్రులతో వచ్చిన చిన్నారులను చూసిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఐఎన్‌టీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు రామచంద్ర కుంతియా చలించిపోయారు. ఆ చిన్నారులను చూస్తే మా మనుమళ్లు, మనుమరాండ్లు గుర్తుకు వస్తున్నారని ‘సాక్షి’కి ఫోన్‌లో వెల్లడించారు. ఏ జాతీయత లేక పోయినా వారు భారత సంతతి వారిగానే గుర్తించి మన దేశం అక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 
    –రామచంద్ర కుంతియా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి 

 
ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌లను జారీ చేయాలి 
విదేశాంగ శాఖ కువైట్‌లోని చిన్నారులకు ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌లను జారీ చేయాలి. కువైట్‌ ప్రభుత్వం ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. అందువల్ల మన విదేశాంగ శాఖ స్పందించి సర్టిఫికెట్‌లను వీలైనంత తొందరగా జారీ చేసి స్వదేశానికి చిన్నారులను చేర్చాలి.    
– డాక్టర్‌ వినోద్‌కుమార్, మాజీ దౌత్యవేత్త, టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ విభాగం చైర్మన్‌  

కువైట్‌ ప్రభుత్వంతో చర్చించాలి 
కువైట్‌లో ఉన్న చిన్నారుల విషయంలో భారత ప్రభుత్వం కువైట్‌ ప్రభుత్వంతో చర్చించి స్వదేశానికి రప్పించాలి. అలాగే ఇక్కడకు చిన్నారులు వచ్చిన తరువాత వారికి గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పించి మెరుగైన విద్యను అందించాల్సిన అవసరం ఉంది. కువైట్‌లో చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది. 2011లో ఆమ్నెస్టీ సమయంలో వేగంగా చర్యలు తీసుకున్నారు. 
    – నంగి దేవేందర్‌రెడ్డి, టీపీసీసీ గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కన్వీనర్‌ 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా