షరీఫ్‌ అరెస్ట్‌: పెద్ద ఎత్తున ఘర్షణలు

14 Jul, 2018 11:27 IST|Sakshi

లాహోర్‌ : పనామా పత్రాల కేసులో పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు పదేళ్లు, ఆయన కూతురు మరియమ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. కాగా శుక్రవారం రాత్రి స్వదేశంలో అడుగుపెట్టగానే వీరిద్దరిని పోలీసులు ఉద్రిక్త పరిస్థితుల మధ్య అరెస్ట్‌ చేశారు. షరీఫ్‌, మరియమ్‌ల అరెస్ట్‌తో శుక్రవారం రాత్రి లాహోర్‌తో పాటు దాని పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఘర్షణలు చోటుచేసుకున్నాయి. షరీఫ్‌ పార్టీ పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌(పీఎంఎల్‌-ఎన్‌)కు చెందిన కార్యకర్తలను లాహోర్‌లోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు అధికారులు ముందు జాగ్రత్తగా బలగాలను మొహరించారు. చాలా చోట్ల  ఆ పార్టీ శ్రేణులను అడ్డగించడంతో వారు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘర్షణల్లో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 30 మంది పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ కార్యకర్తలు కాగా, మిగతా 20 మంది పోలీసులు ఉన్నారు. షరీఫ్‌ను చూడటానికి లాహోర్‌లో గుమిగూడిన కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు.

లాహోర్‌లోని రవి బ్రిడ్జ్‌, బుట్ట చౌక్‌తో పాటు, విమానాశ్రయానికి 5కి.మీ దూరంలోని జోరే పుల్‌లో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ కార్యకర్తలు, పోలీసులు గాయపడ్డారు. అంతకు ముందే పాక్‌లో అడుగుపెట్టగానే షరీఫ్‌ను, ఆయను కూతురిని అరెస్ట్‌ చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. పీఎంఎల్‌-ఎన్‌ కార్యకర్తలు శుక్రవారం ఉదయం నుంచే ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. షరీఫ్‌కు ఘన స్వాగతం పలికేందుకు లాహోర్‌ విమానాశ్రయానికి వెళ్లాలని భావించిన కొందరు కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. వీరిలో 370 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఈ ఘటనలపై పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ అధికార ప్రతినిధి మరియుమ్‌ ఔరంగజేబు మాట్లాడుతూ.. వేలాది మంది తమ పార్టీ కార్యకర్తలు లాహోర్‌కు రాకుండా వివిధ ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. నవాజ్‌, మరియమ్‌కు స్వాగతం పలికేందుకు బయలుదేరిన తమ శ్రేణులను అరెస్ట్‌ చేయడాన్ని ఆమె ఖండించారు. తమ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లాహోర్‌ ర్యాలీలో పాల్గొని అరెస్టయిన 370 మంది పీఎంఎల్‌-ఎన్‌ కార్యకర్తలను విడుదల చేయాలని హైకోర్టు కూడా శుక్రవారం ఆదేశాలు జారీచేసిందని అన్నారు. కాగా అరెస్ట్‌ అనంతరం షరీఫ్‌ను రావల్పిండిలోని అదియాలా జైలుకు, మరియమ్‌ను తాత్కాలిక సబ్‌జైలుగా ఏర్పాటు చేసిన సీహాలా రెస్ట్‌ హౌజ్‌కు తీసుకెళ్లారు.  

>
మరిన్ని వార్తలు