‘ట్రంప్‌ మాటలను పట్టించుకోకండి’

4 Jan, 2018 09:16 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : అమెరికా-పాకిస్తాన్‌ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతున్న దశలో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తొలిసారి స్పందించారు. పాక్‌లో అధికార పార్టీ పీఎంఎల్‌-ఎన్‌ చీఫ్‌ అయిన నవాజ్‌.. ట్రంప్‌ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన పనిలేదని కొట్టి పారేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలను నిలబెట్టేందుకు వ్యూహత్మకంగా వ్యవరించాలని ప్రభుత్వానికి సూచించారు.

ట్రంప్‌ సహాయ నిధుల నిలిపివేత వ్యాఖ్యలపై షరీఫ్‌ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదంపై పోరులో సంకీర్ణ సేనలకు మిత్రదేశంగా పాకిస్తాన్ వ్యవహరించింది. అదే సమయంలో సంకీర్ణ భాగస్వామిగా కూడా ఉంది. ఈ నేపథ్యంలో పాక్‌కు అమెరికా ఇచ్చిన నిధులు సహాయం ఎలా అవుతాయ’ని ప్రశ్నిచారు. ఈ నిధులు కేవలం సంకీర్ణ బాగస్వామ్యం, సైనిక అవసరాల కోసం మాత్రమే అగ్రరాజ్యం ఇచ్చిందన్నారు. ఇప్పటివరకూ ఏ దేశం నుంచి ఉదారవాద నిధులు అందుకోవాల్సిన పరిస్థితిలో పాక్‌ లేదని చెప్పారు. 

ఇదిలావుండగా మాజీ సైనిక పాలకుడు పర్వేజ్‌ ముషారఫ్‌పైనా ఆయన విరుచుకుపడ్డారు. దేశంనుంచి పారిపోయిన ఒక వ్యక్తి.. నేడు అంతర్జాతీయ సమాజం ముందు దేశ గౌరవాన్ని కించ పరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆత్మగౌరవాన్ని అమెరికాకు తాకట్టుపెట్టింది ఆయనేనని విమర్శించారు. 

మరిన్ని వార్తలు