జైలుకే తీసుకెళ్తారని నాకూ తెలుసు.. వైరల్‌

13 Jul, 2018 14:26 IST|Sakshi

లాహోర్‌ : పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్, ఆయన కుమార్తె మర్యమ్‌ శుక్రవారం దేశంలో అడుగుపెట్టగానే అరెస్ట్‌ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మరోవైపు యూఏఈలోని అబుదాబి ఎయిర్‌పోర్టులో బయలుదేరిన అనంతరం షరీఫ్‌ ఓ వీడియోను షేర్‌ చేశారు. జైలుశిక్ష ఎదుర్కోనున్న నేపథ్యంలో విమాన ప్రయాణ సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘నన్ను నేరుగా జైలుకు తీసుకెళ్తారని తెలుసు. పాక్‌ ప్రజల కోసం నేను ఈ వీడియో షేర్‌ చేస్తున్నా. వచ్చే తరాల వారి భవిష్యత్తు కోసం త్యాగాలు చేశాను. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. పాక్‌ భవితవ్యాన్ని మనందరం కలిసి తేల్చాలంటూ’పాక్‌ ప్రజలకు నవాజ్‌ షరీఫ్‌ పిలుపునిచ్చారు. బ్రిటన్‌ నుంచి బయలుదేరిన షరీఫ్‌, మర్యమ్‌లను శుక్రవారం ఉదయం అబుదాబి ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడినుంచి ఇతిహాద్‌ ఈవై 243 విమానంలో లాహోర్‌కు చేరుకోనున్నారు.

కాగా, లండన్‌లోని ఎవన్‌ఫీల్డ్‌ అపార్ట్‌మెంట్‌ కేసులో పదేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్, ఏడేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న ఆయన కుమార్తె మర్యమ్‌ లాహోర్‌లో అడుగుపెట్టగానే పోలీసులు అరెస్ట్‌ చేయనున్నారు. నేటి సాయంత్రం 6.15 గంటలకు నవాజ్, ఆయన కుమార్తె మర్యమ్‌ బ్రిటన్‌ నుంచి లాహోర్‌కు చేరుకోనున్న నేపథ్యంలో వీరిద్దరిని ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్ట్‌ చేయాలని నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబీ) చైర్మన్‌ జావేద్‌ ఇక్బాల్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. వీరిద్దరినీ రావల్పిండిలోని అదియాలా జైలుకు తరలించాలని చూస్తున్నారు. అరెస్ట్‌ సందర్భంగా నగరంలో అల్లర్లు తలెత్తకుండా 10,000 మంది పోలీసుల్ని అధికారులు మోహరించారు.

>
మరిన్ని వార్తలు