క్షీణించిన నవాజ్‌ షరీఫ్‌ ఆరోగ్యం

29 Jul, 2018 19:15 IST|Sakshi
పాక్‌ బహిష్కృత ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ (ఫైల్‌ ఫోటో)

ఇస్లామాబాద్‌ : పాక్‌ బహిష్కృత ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఆరోగ్య పరిస్ధితి క్షీణించడంతో ఆయనను రావల్పిండిలోని అదియాల జైలు నుంచి పాకిస్తాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (పీఐఎంఎస్‌)కు తరలించారు. ఛాతీ నొప్పితో బాధపడుతున్న మాజీ ప్రధాని ఆరోగ్యపరిస్థితిని పరీక్షించిన వైద్యులు కరోనరీ కేర్‌ యూనిట్‌ (సీసీయూ)లో చికిత్స అందిస్తున్నారని జియో న్యూస్‌ వెల్లడించింది. రావల్పిండిలోని జైలులో ఆయనకు నిర్వహించిన కార్డియోగ్రామ్‌ పరీక్షలో లోటుపాట్లు గుర్తించిన వైద్యులు ఆయనను ఆస్పత్రికి తరలించాలని సూచించారని పంజాబ్‌ ప్రావిన్స్‌ హోంమంత్రి షౌకత్‌ జావేద్‌ తెలిపారు.

వైద్యుల సూచనపై జైల్‌ సూపరింటెండెంట్‌ పాక్‌ ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని సంప్రదించిన మీదట షరీఫ్‌ను పిమ్స్‌కు తరలించారు. నవాజ్‌ షరీఫ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఈ నెల 24న వైద్య మండలిని నియమించిన సంగతి తెలిసిందే. షరీఫ్‌కు నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమని ఐదుగురు సభ్యులతో కూడిన వైద్య మండలి సూచించింది.

మరిన్ని వార్తలు