బంగారం నింపిన రైలును నిజంగా పాతిపెట్టారా?

16 Dec, 2015 16:44 IST|Sakshi
బంగారం నింపిన రైలును నిజంగా పాతిపెట్టారా?

బెర్లిన్: ఎప్పుడో నాజీల నాటి రోజుల్లో.. బంగారంతో నింపిన ఓ రైలును భూగర్బంలో పాతిపెట్టి దాచి ఉంచారని జానపదులు చెప్పుకునే మాటలు విని కొందరు గుప్త నిధుల వేటగాళ్లు చెమటోడుస్తున్నారు. రోజుల తరబడి దానికోసం గాలింపులు చేపట్టి చివరకు ఆ ప్రాంతాన్ని గుర్తించి ప్రత్యేక తవ్వకాలు కూడా కొనసాగిస్తున్నారు. అయితే, వారు వెతికిన ఆ చోట ఓ సొరంగ మార్గమైతే కనిపించిందికానీ, రైలు మాత్రం అందులో ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆ వెతికే వారితోపాటు పనిచేస్తున్న నిపుణులు తెలిపారు.

పియోర్ కోపర్, ఆండ్రెస్ రిచ్టెర్ అనే ఇద్దరు వ్యక్తులు తమ హంటింగ్ కు సంబంధించిన విశేషాలు తెలియజేశారు. పోలాండ్ లోని వాల్బ్రిక్ నగరానికి అత్యంత సమీపంలో ఉన్న ఓ వంతెన వద్ద రెండో ప్రపంచ యుద్ధకాలం సమయంలో యుద్ధంలో తలమునకలైన నాజీలు తమ భవిష్యత్తు అవసరాలకోసం బంగారంతో నింపిన ఓ రైలును సొరంగంలో ఎవరికి కనిపించకుండా పాతిపెట్టి ఉంచారని కథలుకథలుగా అక్కడ జానపదులు ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు. నిజంగానే ఆ ప్రాంతంలో ఏదో దాచి ఉంచబడిందనే చెప్పే కొన్ని ప్రాథమిక ఆధారాలు కూడా లభ్యం అయ్యాయి. అయితే, అది బంగారు రైలే అని మాత్రం స్పష్టంగా తెలియదు.

అయినా, ప్రయత్నిస్తే పోయేదేముంది అనుకున్నారేమో ఏమాత్రం నిరాశ చెందకుండా ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా పరిశీలనలు జరిపారు. ఆ ప్రాంతం మొత్తాన్ని రాడార్ల సహాయంతో స్కానింగ్ చేయగా అక్కడ ఓ టన్నెల్ లాంటిది ఉందని తెలిసింది. అయితే, అందులో రైలు ఉన్నట్లు ఆధారాలు మాత్రం ఇప్పటివరకు లభించలేదట. మరోపక్క, ఇదే విషయాన్ని చెప్పేందుకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఒక బృందమేమో తమ బంగారంతో నింపిన రైలు ఉన్నట్లు తోచడం లేదని చెప్పగా మరో బృందం మాత్రం 1945లో సోవియెట్ రెడ్డ్ ఆర్మీ కంటపడకుండా ఉండేందుకు నాజీలు బంగారంతో నింపిన రైలు పెట్టెలను సొరంగంలో పాతిపెట్టారని ఇప్పటికీ జానపదులు చెప్పుకుంటారని, తాము ఆ విషయాన్ని నమ్ముతున్నామని, ఏదేమైనా ఆ సొరంగంలో గాలింపులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే, వారి నమ్మకం నిజమే అయ్యి బంగారు రైలు దొరుకుతుందేమో వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు