నాజీలు దోచింది దాచింది ఇక్కడే..

28 May, 2020 14:59 IST|Sakshi

నాజీ ఆర్మీ అధికారి డైరీలో వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ :  రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా యూరప్‌ వ్యాప్తంగా నాజీలు దోచుకున్న 28 టన్నుల బంగారం, ఇతర సంపదను 16వ శతాబ్ధానికి చెందిన జర్మన్‌ కోటలో పాతిపెట్టినట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ నిధి విలువ 1.25 బిలియన్ యుకె పౌండ్ల(రూ.11,617 కోట్లకు పైగా)ని అంచనా వేశారు. నాజీ ఆర్మీ అధికారి ఎస్ఎస్ స్టాండార్టెన్‌ఫ్యూరర్ ఎగాన్ ఒల్లెన్‌హౌర్ డైరీలో పేర్కొన్న 11 ప్రదేశాలలో ఆధునిక పోలాండ్‌లో ఉన్న హోచ్‌బర్గ్ ప్యాలెస్‌ ఈ నిక్షేపాలను దాచిన వాటిలో కీలకమని వెల్లడైంది.

ఈ డైరీని గత ఏడాదే పరిశోధకులు గుర్తించినట్టు స్పుత్నిక్ న్యూస్‌ వెల్లడించింది. జర్మన్‌ నగరం బ్రెలూ నుంచి కొల్లగొట్టిన రూ. 7,000 కోట్లకు పైగా విలువైన రిచెస్‌బ్యాంక్‌ గోల్డ్‌ బార్లు, ఇతర సంపదను ఈ కోట కింద దాచిఉంచవచ్చని ఈ డైరీని స్వాధీనం చేసుకున్న సిలెసియన్‌ బ్రిడ్జి ఫౌండేషన్‌ పేర్కొంది. కాగా ఈ డైరీని గత ఏడాది పోలాండ్‌ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు అందచేశామని, ప్రభుత్వం ఇంకా దాన్ని పరిశీలించలేదని ఫౌండేషన్‌ చీఫ్‌ రోమన్‌ ఫర్మనియక్‌ వెల్లడించారు.

నిధుల వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే క్రమంలో ఈ అంశాలను ఫౌండేషన్‌ ప్రజల ముందుంచుతోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా నిధి కోసం తవ్వకాలు చేపట్టడం, వెలికితీత సాధ్యమయ్యే పనికాదు. ఈ కోట ప్రస్తుత యజమాని నిధుల వెలికితీతకు అనుమతించారని, దోపిడీ దొంగల కన్నుపడకుండా కోట చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి సీసీటీవీ కెమెరాలను అమర్చారని ఫౌండేషన్‌ వెల్లడించింది. నిధుల్లో బంగారమే కాకుండా మత చిహ్నాలు, పోలండ్‌, సోవియట్‌ యూనియన్‌, ఫ్రాన్స్‌, బెల్జియం దేశాల నుంచి నాజీలు లూటీ చేసిన విలువైన వస్తువులను దాదాపు 11 ప్రాంతాల్లో దాచినట్టు ఈ డైరీలో వెల్లడైంది.

చదవండి : సంక్షోభంలోనూ పెట్టుబడులకు చాన్స్‌

మరిన్ని వార్తలు