ఫరూక్‌తో ఎన్‌సీ బృందం భేటీ

7 Oct, 2019 03:40 IST|Sakshi

‘370’ రద్దు తర్వాత మొదటి సమావేశం

నేతలను విడుదల చేయకుండా ‘స్థానికం’లో ఎలా పాల్గొంటాం?: ఎన్‌సీ

నేడు మెహబూబాతో పీడీపీ నేతల భేటీ

శ్రీనగర్‌/ ఇస్లామాబాద్‌: కశ్మీర్‌ ప్రత్యేక హోదా రద్దు తర్వాత తొలి కీలక రాజకీయ పరిణామం సంభవించింది. గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ అనుమతి మేరకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ) నేతలు గృహ నిర్బంధంలో ఉన్న పార్టీ అగ్ర నేతలు ఫరూక్, ఒమర్‌ అబ్దుల్లాలతో ఆదివారం ఆ పార్టీ నేతలు భేటీ అయ్యారు. జమ్మూ ప్రొవెన్షియల్‌ ఎన్‌సీ చీఫ్‌ దేవీందర్‌ సింగ్‌ రాణా నేతృత్వంలోని 15 మంది నేతల బృందం వారితో రాష్ట్రంలో పరిణామాలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించింది.

కేంద్రం ఆర్టికల్‌ 370 రద్దు ప్రకటన విడుదల చేసిన తర్వాతి రోజు ఆగస్టు 5 నుంచి మాజీ సీఎంలు, ఎన్‌సీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా తదితర ప్రధాన పార్టీల నేతలను గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ఎన్‌సీ నేతలు మొదటగా ఒమర్‌ అబ్దుల్లాతో అరగంటపాటు సమావేశమయ్యారు. గడ్డంతో కొత్తగా కనిపించిన తమ నేతతో వారంతా సెల్ఫీలు తీసుకున్నారు. ఆ తర్వాత ఫరూక్‌ అబ్దుల్లాను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం రాణా మీడియాతో మాట్లాడుతూ.. తమ నేతలు ప్రజలపై ఆంక్షల విషయంలో కలత చెందుతున్నారని తెలిపారు.  ‘రాష్ట్రం మొత్తం దిగ్బంధంలో ఉంది. మా పార్టీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లాను ప్రజా భద్రతా చట్టం (పీఎస్‌ఏ) చట్టం కింద నిర్బంధించారు. ఆయన లేకుండా ఎన్నికల మేనిఫెస్టో ఎలా సాధ్యం? నేతలను వెంటనే విడుదల చేయాలి’అని పేర్కొన్నారు.

నేడు మెహబూబాతో సమావేశం
పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పీడీపీ) చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీతో సోమవారం భేటీ అయ్యేందుకు ఆ పార్టీకి చెందిన 10 మంది నేతల బృందానికి నిర్బంధంలో ఉన్న పార్టీ గవర్నర్‌ అనుమతించారు.
 

మరిన్ని వార్తలు