జుకర్ బర్గ్ పై ఇరుగు పొరుగుల ఆగ్రహం..!

20 Jan, 2016 06:28 IST|Sakshi
జుకర్ బర్గ్ పై ఇరుగు పొరుగుల ఆగ్రహం..!

ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు... బిలియనీర్ మార్క్ జుకర్ బర్గ్ పై ఇరుగు పొరుగులు విరుచుకు పడుతున్నారు. ఆయన చట్టవిరుద్ధంగా పార్కింగ్ ను వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతిపెద్ద కార్లను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి, కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బంది కలుగజేస్తున్నారంటూ  వారు రాసిన లేఖ ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది.  

శాన్ ఫ్రాన్సిస్కో లో నివసిస్తున్న ముఫ్ఫై ఏళ్ళ  వ్యాపారవేత్త, ప్రపంచ ధనికుల్లో ఒకరైన మార్క్ జుకర్ బర్గ్ ఇప్పుడు స్థానికుల ఆగ్రహానికి గురౌతున్నారు. లిబర్టీ హిల్ కమ్యూనిటీలోని ఆయన ఇంటికి దగ్గరగా నివసిస్తున్న కొందరు.. జుకర్ వాహనాల  పార్కింగ్ తీరును తప్పుబడుతున్నారు.  ఆయన సెక్యూరిటీ  సిబ్బంది... ఎప్పుడూ దారికి అడ్డంగా, చట్ట విరుద్ధంగా అతి పెద్ద రెండు సిల్వర్ కార్లను నిలిపి అత్యంత సమస్యను తెచ్చి పెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. రాంగ్ పార్కింగ్ తో తెచ్చిపెడుతున్న సమస్యను నగర రవాణా ఏజెన్సీకి, జుకర్ బర్గ్ ఇంటి భద్రతా మేనేజర్ టిప్ వెన్జెల్ కు ఫిర్యాదు చేశారు. అంతేకాక ఆయన లగ్జరీ హోమ్ కు సుదీర్ఘ కాలంపాటు పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టడం కూడ కాలనీవాసులకు తలనొప్పిగా మారిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

జుకర్ బర్గ్ చాలాకాలంపాటు తమ ఇంటి నిర్మాణం కొనసాగించడంతో తీవ్రమైన శబ్దం, చెత్తతోపాటు, వీధుల్లో స్థలాన్ని ఆక్రమించడం స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, ఇప్పటికే పౌరులుగా తాము సాధ్యమైనంత ఓపిక పట్టామని, చివరికి తమకిదో పరీక్షగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వీధిని ఆక్రమిస్తున్న ఆ  రెండు ఎస్ యూ వీ (స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్) కార్లను తగిన పార్కింగ్ స్థలంలో ఉంచాలని వారు డిమాండ్ చేశారు. డాలర్స్ పార్క్ కు దగ్గరలోని జిల్లాలో ఆయనకు ఇంతకుముందే రాంగ్ పార్కింగ్ సమస్య వచ్చిందని, ఇప్పుడు అది స్ట్రీట్ పార్కింగ్ కు పాకిందని అంటున్నారు. జుకర్ బర్గ్ చట్ట విరుద్ధంగా పార్కింగ్ ఆక్రమణలకు పాల్పడుతున్నారని, ఇంతకు ముందుకూడ ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు