నేపాల్ కన్నీళ్లు తుడుస్తాం

27 Apr, 2015 02:09 IST|Sakshi
నేపాల్ కన్నీళ్లు తుడుస్తాం

న్యూఢిల్లీ: నేపాల్‌ను భూకంపం అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఆ దేశ ప్రజలను అన్నివిధాలా ఆదుకునేందుకు భారత్ కృషిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో మీ వెంటే ఉండి కన్నీళ్లు తుడుస్తామని, శిథిలాల్లో సజీవంగా చిక్కుకున్న వారిని రక్షించేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తామని చెప్పారు. మోదీ ఆదివారం ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో మాట్లాడారు. ‘నేపాల్‌లో భూకంపం భారీ నష్టాన్ని మిగిల్చింది. 2001 జనవరి 26న కచ్(గుజరాత్)లో భూకంపంతో వాటిల్లిన పెను నష్టాన్ని దగ్గరి నుంచి చూశా.

అందువల్ల నేపాల్ ప్రజలు పడుతున్న వేదన నాకు తెలుసు. మట్టి దిబ్బల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇప్పటికే పలు సహాయక బృందాలను, స్నిఫర్ డాగ్స్‌ను నేపాల్‌కు పంపాం’ అని అన్నారు. ‘ప్రియమైన నేపాల్ సోదర సోదరీమణులారా! 125 కోట్ల మంది భారతీయులు నేపాల్‌ను సొంత దేశంగానే భావిస్తారు. నేపాల్‌లో ఉన్న ప్రతీ ఒక్కరి కన్నీళ్లను తుడిచేందుకు మేమున్నాం’ అన్నారు. సహాయ కార్యక్రమాలను దీర్ఘకాలం కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. ఇటీవలి అకాల వర్షాలు, బిహార్ వరదలను ఆయన గుర్తు చేశారు. నేపాల్  విపత్తు వాటికంటే పెద్దదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు