భారత్‌పై నేపాల్‌ ప్రధాని ఘాటు వ్యాఖ్యలు

26 May, 2020 14:18 IST|Sakshi

ఖాట్మండూ: నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి భారత్‌పై విరుచుకుపడ్డారు. భారత సరిహద్దుల వద్ద నిబంధనలు ఉల్లంఘించి పౌరులు తమ దేశంలో ప్రవేశించి ప్రాణాంతక కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలను తుంగలో తొక్కి అంటువ్యాధి ప్రబలడానికి కారణమవుతున్నారంటూ మండిపడ్డారు. ఇతర దేశాల వల్లే నేపాల్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ పరోక్షంగా భారత్‌పై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోమవారం జాతిని ఉద్దేశించి మాట్లాడిన ఓలి... దక్షిణాసియాలో అన్ని దేశాల కంటే నేపాల్‌లోనే కరోనా మరణాల సంఖ్య అతి తక్కువగా ఉందన్నారు. ఈ క్రమంలో నేపాలీ వైద్య నిపుణుల సూచనల ప్రకారం దేశ జనాభాలోని రెండు శాతం ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కరోనా లక్షణాలతో బాధ పడుతున్న వారికి క్వారంటైన్‌ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. (యుద్ధానికి మా ఆర్మీ సిద్ధం: నేపాల్‌ మంత్రి )

అదే విధంగా... కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అనుసరించాల్సిన వ్యూహాలపై తాను పలు రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలతో మాట్లాడినట్లు ఓలి తెలిపారు. వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన నేపాలీలను సురక్షిత పద్ధతిలో స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కాగా లిపులేఖ్‌, కాలాపానీ అంశంలో భారత్‌- నేపాల్‌ల మధ్య వివాదం ముదిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత వారం భారత్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన కేపీ శర్మ ఓలి.. చైనా, ఇటలీ కంటే భారత్‌ నుంచి వ్యాపించే వైరస్‌ మరింత ప్రమాదకరమైనదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్‌ నుంచి వచ్చే వాళ్ల వల్లే తమ దేశంలో మహమ్మారి ప్రబలుతోందని ఆరోపించారు. (భారత్‌పై నేపాల్‌ ప్రధాని షాకింగ్‌ కామెంట్లు!)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు