చైనాకు మద్దతు పలికిన నేపాల్‌!

4 Jun, 2020 15:00 IST|Sakshi
నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి- చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌(ఫైల్‌ఫొటో)

హాంకాంగ్‌పై చైనా ఆధిపత్యం.. మద్దతు ప్రకటించిన నేపాల్‌, పాకిస్తాన్‌

ఖాట్మండూ: హాంకాంగ్‌ను పూర్తిస్థాయిలో తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు చైనా ప్రవేశపెట్టిన వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని నేపాల్‌ సమర్థించింది. హాంకాంగ్‌ చైనాలో అంతర్గత భాగమని.. డ్రాగన్‌ అవలంబిస్తున్న.. ‘‘ఒక దేశం- రెండు వ్యవస్థలు’’ విధానానికి అనుకూల వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు నేపాల్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘శాంతి- భద్రతలు కాపాడటమనేది పాలకుల ప్రాథమిక బాధ్యత. పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనాలో హాంకాంగ్‌ అంతర్భాగమని నేపాల్‌ పునరుద్ఘాటిస్తోంది. అక్కడ శాంతి భద్రతల పరిరక్షణకై చైనా చేస్తున్న ప్రయత్నాలకు నేపాల్‌ మద్దతు పలుకుతోంది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని నేపాల్‌ భావిస్తుంది’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.(హాంకాంగ్‌పై చైనా పెత్తనం.. షాకిచ్చిన ట్రంప్‌!)

కాగా నేరస్తుల అప్పగింతకై ఒప్పందం కుదుర్చుకునేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ గతేడాది అక్టోబరులో నేపాల్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేపాల్‌లో నివసిస్తూ.. చైనాను విమర్శించే వాళ్లు, తమకు వ్యతిరేకంగా మాట్లాడే టిబెట్లను అరెస్టు చేసి.. తమకు అప్పగించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సమయంలోనే హాంకాంగ్‌లో అల్లర్లు చెలరేగగా.. తమ నుంచి హాంకాంగ్‌ను వేరు చేస్తే సహించేది లేదంటూ జిన్‌పింగ్‌ నేపాల్‌ గడ్డమీది నుంచే హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా నేపాల్‌ ఆయన వ్యాఖ్యలను మరింతగా సమర్థిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఇక లిపులేఖ్‌, కాలాపానీ, లింపియధుర విషయంలో భారత్‌- నేపాల్‌ల మధ్య విభేదాలు నెలకొన్న విషయం విదితమే.(భారత బలగాలు వెనక్కి వెళ్లాలి: నేపాల్‌ మంత్రి)

ఇక ప్రపంచ వాణిజ్య కేంద్రాల్లో ఒకటి భాసిల్లుతున్న హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తిని రద్దు చేసే విధంగా ఉన్న జాతీయ భద్రతా చట్టానికి మద్దతుగా నిలవాలని భారత్‌ సహా వివిధ ఆసియా దేశాలకు చైనా విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా మిత్రదేశమైన పాకిస్తాన్‌.. హాంకాంగ్‌ విషయంలో తాము మనస్పూర్తిగా డ్రాగన్‌ వైపే నిలబడతామని స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా, యూకే చైనా ఆధిపత్య ధోరణిని నిరసిస్తూ హాంకాంగ్‌ ప్రజలకు సంఘీభావం తెలియజేశాయి.    

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు