జనం భీతావహం

14 May, 2015 05:58 IST|Sakshi
జనం భీతావహం

నేపాల్‌లో క్షణం క్షణం భయం భయం..
తాజా భూకంపంలో 79కి చేరిన మృతులు

 
కఠ్మాండు: నేపాల్‌లో భూ ప్రకోపం కొనసాగుతూనే ఉంది. మంగళవారం నాటి భారీ భూకంపం అనంతరం తీవ్రస్థాయి భూప్రకంపనలు ఆ దేశాన్ని చిగురుటాకులా వణికిస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ 33 ప్రకంపనలు సంభవిస్తే బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ మరో 13 పైగా ప్రకంపనలు సంభవించాయి.  భూకంప మృతుల సంఖ్య 79కి పెరిగింది. వరుస భూకంపాలతో ఇళ్లు పేకమేడల్లా కూలి పోతుండటం.. వందలాదిప్రాణాలు గాలిలో కలిసిపోతుండటంతో వేలాది మంది నేపాల్ ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
 
 ఇళ్లలోకి వెళ్లకుండా ప్రాణా లు అరచేతిలో పెట్టుకుని ఆరుబయటే ప్లాస్టిక్ టెంట్లలో జీవిస్తున్నారు. మూడు వారాల క్రితం సంభవించిన ఆ భూకంపం 8,000 మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ విల యం నుంచి కోలుకునేందుకే అష్టకష్టాలు పడుతున్న నేపాల్‌ను మంగళవారం రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతగా నమోదైన భూకంపం మరోసారి దెబ్బతీసింది. దేశంలోని 32 జిల్లాలు తాజా భూకంపం ప్రభావానికి గురయ్యాయని పోలీసులు తెలిపారు. కఠ్మాండుకు ఈశాన్యం గా పర్వతప్రాంతాల్లో ఉన్న మారుమూల జిల్లాలపై ఈ భూకంపం ప్రభావం ఎక్కువగా ఉంది. పెద్ద సంఖ్యలో ఇళ్లు, భవనాలు కుప్పకూలగా.. కొండచరియలు విరిగిపడి పలు ప్రాంతాల్లో దారులు మూసుకుపోయాయి.  
 
 అమెరికా సైనిక విమానం అదృశ్యం...
 నేపాల్‌లోని భూకంప బాధితులకు సహాయ సరకులు అందించేందుకు ప్రయాణిస్తున్న అమెరికా సైనిక విమానం జాడ తెలియకుండా పోయింది. ఇందులో ఆరుగురు అమెరికా మెరైన్లు, ఇద్దరు నేపాల్ సైనికులు ఉన్నారు.  దీంతో ఈ హెలికాప్టర్, అందులోని సైనికులు కోసం భారీ ఎత్తున గాలింపు చేపట్టారు. కాగా, నేపాల్‌లో తాజా భూకంపం నేపధ్యంలో ఆ దేశ ప్రధాని సుశీల్ కొయిరాలాతో భారత ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. భారత్ నుంచి సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
 
 21కి పెరిగిన బిహార్ మృతులు
 పట్నా:  మంగళవారం సంభవించిన తీవ్ర భూకంపం వల్ల బిహార్‌లో మృతుల సంఖ్య 21కి, క్షతగాత్రుల సంఖ్య 84కి పెరిగింది. భూకంప బాధితులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రధాన కార్యదర్శి వ్యాస్‌జీ తెలిపారు. భూకంపం ప్రభావం పట్నా, తూర్పు చంపారన్ జిల్లాలపై ఎక్కువగా ఉంది. రెండు జిల్లాల్లోనూ ముగ్గురు చొప్పున చనిపోయారు. మాధేపురా, పూర్ణియా, వైశాలి, శివాన్, దర్భంగా జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. సీతామార్హి, ఖగారియా, షేక్‌పురా జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతిచెందారు.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా