నేపాల్‌ ప్రధానిగా దేవ్‌బా

7 Jun, 2017 09:33 IST|Sakshi
నేపాల్‌ ప్రధానిగా దేవ్‌బా

కట్మాండు: నేపాల్‌ నూతన ప్రధానిగా సీనియర్‌ నాయకుడు షేర్‌ బహదూర్‌ దేవ్‌బా(70) మంగళవారం ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవి చేపట్టడం ఇది నాలుగోసారి. ప్రధాన ప్రతిపక్షం యూఎం ఎల్, ఇతర పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి దించకపోవడంతో దేవ్‌బా ఎన్నిక లాంఛనమైంది. పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో దేవ్‌బాకు అనుకూలంగా 388 ఓట్లు, వ్యతిరేకంగా 170 ఓట్లు పోలయ్యాయి. దీంతో నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడైన ఆయన నేపాల్‌కు 40వ ప్రధాని కానున్నారు. నేపాలీ కాంగ్రెస్‌తో కుదిరిన ఒప్పందంలో భాగంగా మావోయిస్ట్‌ నేత ప్రచండ రాజీనామా చేయడంతో ప్రధాని పదవికి తాజా ఎన్నిక అనివార్యమైంది.దేవ్‌బా ప్రభుత్వంలో మాధేశీ పార్టీలు కూడా చేరే అవకాశాలున్నాయి.

రెండో దశ స్థానిక ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఇప్పుడు  దేవ్‌బాపై పడనుంది. ఆయన 1995–97, 2001–02, 2004–05 మధ్య కాలంలో నేపాల్‌ ప్రధానిగా పనిచేశారు.  దేవ్‌బాకు భారత నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే 1996లో మహంకాళి నది నీటి పంపకానికి భారత్, నేపాల్‌ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. దేవ్‌బాకు భారత ప్రధాని మోదీ ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు.  దేవ్‌బా నేతృత్వంలో నేపాల్‌లో శాంతి, అభివృద్ధి నెలకొనాలంటూ మోదీ ట్వీట్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు