ఊళ్లోకే వచ్చేస్తాయ్... పచ్చటి పొలాలు!

19 Sep, 2016 03:32 IST|Sakshi

నగరాల్లో ఉన్న పిల్లల్ని బియ్యం ఎక్కడ నుంచి వస్తాయిరా? అని అడగండి... సూపర్‌ మార్కెట్ నుంచి అని ఠక్కున సమాధానిమిస్తారు. కొంతమందైతే బియ్యం చెట్లకు కాస్తాయి అని అన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. నగర జీవితం అంత యాంత్రికమైపోయింది మరి. ఈ సమస్య నెదర్లాండ్స్‌లోనూ ఉన్నట్టుంది. అందుకే నగర జీవులకు పచ్చదనాన్ని పరిచయం చేయడంతోపాటు ఎక్కడో పండిన పంటలను వందల కిలోమీటర్ల దూరం మోసుకొస్తారు కాబట్టి... వాటి ద్వారా పరోక్షంగా పెరిగే కాలుష్యాన్ని తగ్గించాలని స్పేస్ 10 అనే ఆర్కిటెక్చర్ సంస్థ ఈ అద్భుతమైన పచ్చటి గోళాన్ని డిజైన్ చేసింది.

క్లుప్తంగా చెప్పాలంటే ఇదో చిన్నపాటి పొలమనుకోండి. పేరు ‘గ్రో రూమ్’.  కాయగూరలు, ఆకు కూరలతోపాటు కొన్ని రకాల ఇతర మొక్కల్ని కూడా దీంట్లో పండిస్తున్నారు. నగరాల్లో ఇలాంటివి వీలైనన్ని ఏర్పాటు చేస్తే అటు కాలుష్యం తగ్గడంతోపాటు ఇటు కాయగూరలపై పెట్టే ఖర్చు కూడా తగ్గుతుందని స్పేస్ 10 అంటోంది. అంతేకాకుండా... కాంక్రీట్ జనారణ్యం మధ్యలో ఇలాంటి పచ్చటి గోళాలు ఉంటే కంటికి కూడా ఇంపుగా ఉంటుందన్నది వీరి అంచనా. కేవలం కాయగూరలు, ఆకు కూరలను పండించడమే కాకుండా ఇందులో ఈ గోళం మధ్యలో కొంతమంది హాయిగా కూర్చుని రిలాక్స్ అయ్యేందుకూ ఏర్పాట్లు ఉన్నాయి. ఈ నెలలోనే తొలి గ్రో రూమ్ ఏర్పాటు కాగా... చిన్న పిల్లలు కళ్లింత చేసుకుని చూస్తున్నారట., భారతదేశంలో ఇలాంటి వాటి అవసరం ఇప్పట్లో ఉండకపోవచ్చుగానీ... ఇదో ఆసక్తికరమైన ఐడియా అన్నది మాత్రం నిజం!

మరిన్ని వార్తలు