విమానాలతో హరికేన్‌ల అంచనా!

19 Mar, 2014 05:18 IST|Sakshi

వాషింగ్టన్: విమానాల ద్వారా హరికేన్(పెనుతుపాను)లను అంచనా వేసేందుకు ఉపయోగపడే  కొత్త జీపీఎస్ వ్యవస్థను అమెరికా  శాస్త్రవేత్తలు అభివృద్ధిపర్చారు. ‘జిస్మోస్ (గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇన్‌స్ట్రుమెంట్ సిస్టమ్ ఫర్ మల్టిస్టాటిక్ అండ్ అకల్టేషన్ సెన్సింగ్)’గా పేరుపెట్టిన ఈ జీపీఎస్ వ్యవస్థను అన్ని సాధారణ విమానాలకూ అమర్చి అవి ప్రయాణించే మార్గాల్లో గాలిలో తేమ, ఉష్ణోగ్రత, ఇతర వాతావరణ పరిస్థితులను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం జీపీఎస్ ఉపగ్రహ సంకేతాలను ఉపయోగించుకుని వాతావరణ సమాచారాన్ని నేలపై అక్కడక్కడా స్థిరంగా ఉండే జీపీఎస్ రిసీవర్ల ద్వారా సేక రించి అంచనా వేస్తున్నారు.     
 
 అయితే ఉపగ్రహాలపై జీపీఎస్ రిసీవర్లను అమర్చ డం ఖర్చుతో కూడుకున్నది కావడంతోపాటు మహాసముద్రాలపై ముఖ్యంగా హరికేన్‌ల వంటివి ఏర్పడిన చోట వాతావరణం అంచనా కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో జిస్మోస్ వ్యవస్థను విమానాలకు అమర్చితే అవి సముద్రాలపై ఎగురుతున్నప్పుడు అక్కడి వాతావరణ అంశాల సమాచారం అందుతుందని, దీంతో హరికేన్‌ల వంటి వాటి ముప్పును, తీవ్రతను ముందుగానే అంచనా వేసేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక ఫ్రిజ్ అంత సైజులో ఉన్న ఈ వ్యవస్థను బూట్లు ప్యాక్‌చేసే అట్టపెట్టె అంత సైజుకు తగ్గించేందుకు వారు కసరత్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు