రోబో ‘ఆర్మీ’కి సరికొత్త కృత్రిమ మేధస్సు

5 Feb, 2018 03:26 IST|Sakshi

వాషింగ్టన్‌: రోబోలకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు, వాటి సేవలను ఆర్మీలో వినియోగించుకునేందుకు అవసరమైన సరికొత్త కృత్రిమ మేధస్సును శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్, యూఎస్‌ ఆర్మీ రీసెర్చ్‌ లేబొరేటరీకి చెందిన పరిశోధకులు ముందుగా క్రిటిక్‌ రూపంలో రియల్‌ టైమ్‌ ఫీడ్‌బ్యాక్‌ను నిక్షిప్తం చేశారు. అనంతరం టేమర్‌ అనే అల్గారిధమ్‌ ద్వారా రోబోను మ్యాన్యువల్‌గా పరీక్షించారు. దీని ఆధారంగా మరింత మెరుగైన డీప్‌ టేమర్‌ అనే సరికొత్త అల్గారిధమ్‌ను రూపొందిం చారు.

ఆ తర్వాత అటారీ గేమింగ్‌ సంస్థ రూపొందించిన గేమింగ్‌ ఆటకు సంబంధించిన 15 నిమిషాల సమాచారాన్ని రియల్‌ టైమ్‌ ఫీడ్‌ బ్యాక్‌ను నిక్షిప్తం చేశారు. కొత్తగా రూపొందించిన డీప్‌ టేమర్‌ అల్గారిధమ్‌ ద్వారా మరోమారు రోబోను పరీక్షించారు. ఈ పరీక్షలో మానవుల కంటే రోబోలు మెరుగైన ఆటతీరును ప్రదర్శించినట్లు గుర్తించారు. వచ్చే రెండేళ్లలో మరికొన్ని రంగాల్లో డీప్‌ టేమర్‌ అల్గారిధమ్‌ను పరీక్షిస్తామని యూఎస్‌ ఆర్మీ రీసెర్చ్‌ లేబొరేటరీకి చెందిన గారెట్‌ వార్నెల్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు