కరోనా : జపాన్‌ నౌకలో 200 మంది భారతీయులు

9 Feb, 2020 04:21 IST|Sakshi
‘డైమండ్‌ ప్రిన్సెస్‌’ నౌక

కరోనా వ్యాధి నేపథ్యంలో జపాన్‌ నౌకలో చిక్కుకుపోయిన భారతీయుల అభ్యర్థన

ఈనెల 19 వరకు నిర్బంధం తప్పదంటున్న జపాన్‌ ప్రభుత్వం

టోక్యో/బీజింగ్‌/జెనీవా: కరోనా భయంతో జపాన్‌ ప్రభుత్వం యెకోహోమా తీరంలో నిలిపివేసిన నౌకలోని భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’ అనే ఆ నౌకలో నిర్బంధంలో ఉన్న బినయ్‌ కుమార్‌ సర్కార్‌ అనే భారతీయుడు తమను కాపాడాలంటూ సోషల్‌ మీడియా ద్వారా వేడుకున్నారు. 200 మంది భారతీయులతో పాటు నౌకలో అంతా కలిపి 3,700 మంది ఉన్నారనీ, వీరిలో 62 మందికి కరోనా సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ కాగా తమ నౌకను అధికారులు దిగ్బంధించినట్లు బినయ్‌ పేర్కొన్నాడు.

మరింత మందికి వైరస్‌ సోకే ప్రమాదం ఉండడంతో తమను కాపాడాలంటూ బినయ్‌ ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో పెట్టారు. ‘మేం కోరుకుంటోంది ఒక్కటే, దయచేసి మమ్మల్ని ఈ నౌక నుంచీ, ఈ నిర్బంధం నుంచీ వేరు చేసి, ప్రత్యేకంగా ఉంచండి. మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. మాకు భయంగా ఉంది. దయచేసి సాయం చేయండి’అని అందులో ఉంది. వైరస్‌ ఇంకా మరింత మందికి వ్యాపించకుండా ఉంటే, ఫిబ్రవరి 19 వరకు వీరందరినీ వేరుగా ఉంచాల్సి ఉంటుందని నౌకలోని జపాన్‌ అధికారులు శుక్రవారం చెప్పారు. ‘జపాన్‌ కాలమానం ప్రకారం ఫిబ్రవరి 6వ తేదీ రాత్రి 7 గంటల వరకు భారతీయులెవ్వరికీ కరోనా సోకలేదు. ప్రస్తుతం నౌకలోని చివరి బృందానికి పరీక్షలు నిర్వహిస్తున్నాం’అని జపాన్‌ ప్రభుత్వం వెల్లడించింది.  

723కు చేరిన కరోనా మృతులు
చైనాలో కరోనా వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య 723కు చేరింది. వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిన కేసులు 34,598కు చేరాయి. తాజాగా, 1,280 మంది వ్యాధిగ్రస్తుల పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు చైనా నేషనల్‌ హెల్త్‌క మిషన్‌ ప్రకటించింది. చైనాలో కరోనా వైరస్‌ బారిన పడి అమెరికాకు చెందిన ఓ మహిళ, జపనీయుడొకరు మృతి చెందారు. కరోనాతో చైనాలో విదేశీయులు మరణించిన తొలి ఘటన ఇదే.  

కరోనాకు శాశ్వత పేరుపై తర్జనభర్జన
ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త రకం వైరస్‌ కరోనాకు శాశ్వతంగా ఏం పేరు పెట్టాలనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తర్జనభర్జన పడుతోంది. కరోనా వైరస్‌ ప్రారంభమైన వుహాన్‌ నగరం పేరు గానీ, అటు చైనా ప్రజల మనోభావాలు గానీ దెబ్బతినకుండా ఉండేలా పేరు పెట్టాలని జాగ్రత్త వహిస్తోంది. ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా పేర్కొన్న ఈ వ్యాధికి ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ అధికారికంగా తాత్కాలిక పేరు ‘2019–ఎన్‌కోవ్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ డిసీజ్‌’అని పెట్టింది. ‘ఎన్‌కోవ్‌’అంటే ‘నావల్‌ కరోనావైరస్‌’అని అర్థం అని తెలిపింది. ‘పేరుతో ప్రదేశానికి ఎలాంటి సంబంధం లేకుండా ఉండేలా ఓ పేరును పెట్టడం చాలా ముఖ్యమని మేం భావించాం’అని డబ్ల్యూహెచ్‌వో అత్యవసర వ్యాధుల విభాగం అధిపతి మరియా తెలిపారు. శాశ్వత పేరు పెట్టడంపై నిర్ణయం కొద్దిరోజుల్లోనే తీసుకుంటామని, డబ్ల్యూహెచ్‌వోతో పాటు ఇంటర్నేషనల్‌ కమిటీ ఆన్‌ టాక్సానమీ ఆఫ్‌ వైరస్‌ (ఐసీటీవీ) కరోనా నిపుణుల నిర్ణయం మేరకు ఉంటుందని ఆమె వెల్లడించారు.

ఎయిర్‌ హగ్‌ !
కరోనా బాధితులకు సేవలు అందించేందుకు ఆస్పత్రిలో చేరిన నర్స్‌ లియు హైయాన్‌ తన కూతురు చెంగ్‌ను 10 రోజుల నుంచి కలవలేదు. శనివారం చెంగ్‌ ఆస్పత్రి వద్దకు వచ్చింది. అయితే కరోనా కారణంగా ఇద్దరు కలవడం కుదరకపోవడంతో దూరం నుంచే కౌగిలింత ఇచ్చినట్లుగా ఏడుస్తూ చేతులు చాచి భావోద్వేగానికి గురయ్యారు. ‘మమ్మీ వైరస్‌తో పోరాడుతోంది.. తగ్గగానే ఇంటికి వస్తుంది’ అని చెబుతూ.. చక్కగా, మంచిగా ఉండాలని కుమార్తెకు సూచించారు. కరోనా కారణంగా తల్లీకూతుళ్లు కన్నీళ్ల నడుమ జరిగిన ఈ ఎయిర్‌ హగ్‌ చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.

తల్లి, కూతుళ్ల ఎయిర్‌ హగ్‌

మరిన్ని వార్తలు