అంతా కలిసే మాట్లాడుకోవచ్చు!

10 Jan, 2018 12:15 IST|Sakshi

వాట్సాప్‌లో త్వరలో గ్రూప్‌ కాల్స్‌ ఫీచర్‌ 

న్యూయార్క్‌: వాట్సాప్‌ అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్నీ బంధువులకు, స్నేహితులకు దాని ద్వారానే చెప్పడం మనందరికీ అలవాటైపోయింది. ఒకే క్లిక్‌తో గ్రూప్‌లో ఉన్నవారందరికీ ఒకేసారి మెసేజ్‌ను పంపే సదుపాయాం ఇప్పటికే అందుబాటులో ఉంది. కాగా.. గ్రూప్‌లోని సభ్యులందరితో ఒకేసారి మాట్లాడడం, వీడియో కాల్స్‌ చేయడం వంటి సదుపాయం మాత్రం ఇప్పటిదాకా అందుబాటులోకి రాలేదు. కానీ త్వరలోనే ఈ సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నట్లు వాట్సాప్‌ ప్రకటించింది. 

ఇప్పటికే ఉన్న కాల్‌ స్విచ్చింగ్‌ ఆప్షన్‌ను ఇకపై తీసేస్తామని తెలిపింది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే ఒక గ్రూప్‌నకు చెందిన యూజర్లు మూకుమ్మడిగా వాయిస్‌ లేదా వీడియో కాల్స్‌ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఫేస్‌బుక్‌ స్టిక్కర్లు,  గ్రూప్‌ కేటగిరిని బట్టి ప్రత్యేక స్టిక్కర్లు యూజర్లకు లభ్యం కానున్నాయి. ఇవేకాక కాంటాక్ట్స్‌లను వెతికేందుకు, రిప్లై ఇచ్చేందుకు కొత్త ఆప్షన్లను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. దీంతో గ్రూప్‌తో సంబంధం లేకుండా ప్రైవేట్‌గా చాటింగ్‌ చేయవచ్చు. గ్రూప్‌ అడ్మిన్లకు మరిన్ని కంట్రోల్‌ ఆప్షన్లను ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నామని తెలిపింది. ఇవన్నీ అందుబాటులోకి వస్తే.. ఇక వాట్సాప్‌ లేకుండా ఉండడం కష్టమే!   

మరిన్ని వార్తలు