చెత్త నుంచి కొత్త ఫర్నిచర్‌

8 Oct, 2017 03:19 IST|Sakshi

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌: వీధుల్లోకి వెళితే ఎక్కడ పడితే అక్కడ కనిపించే చెత్త ఏమైనా ఉందీ అంటే అది ప్లాస్టిక్‌ మాత్రమే. ఇప్పటివరకూ వదిలించుకునే దారి లేదు కాబట్టి నడిచిపోయిందిగానీ ఇకపై మాత్రం అలా కాదు. ఎందుకు అంటారా? సమాధానం ఈ ఫొటోల్లో ఉంది. ప్లాస్టిక్‌తోపాటు స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్లను కూడా అక్కడికక్కడే రీసైకిల్‌ చేసే యంత్రం ఇది. పేరు ట్రాష్‌ ప్రెస్సో. పెద్ద పెద్ద సోలార్‌ ప్యానెల్స్‌ ఉత్పత్తి చేసే విద్యుత్తుతోనే ఇది పని చేస్తుంది. పెంటాటోనిక్‌ అనే కంపెనీ తయారు చేసింది. ఈ కంపెనీ రీసైకిల్‌ చేసిన ప్లాస్టిక్‌తో కుర్చీలు, టేబుళ్ల వంటి ఫర్నిచర్‌ తయారు చేస్తుంది.

ఇటీవల లండన్‌లో జరిగిన డిజైన్‌ ఫెస్టివల్‌లో దీన్ని సోమర్‌సెట్‌ హౌస్‌ వద్ద ప్రదర్శించారు. అక్కడికొచ్చిన వారందరినీ తమ వద్ద ఉన్న వాడేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లను తమకివ్వమని కోరి.. అక్కడికక్కడే ఆ బాటిళ్లతో ఫుట్‌పాత్‌లపై వేసుకోగల టైల్స్‌ను తయారు చేశారు. ఎలాంటి ప్రమాదకర రసాయనాలను వాడకుండా తాము ఈ పని చేయగలుగుతున్నామని, దీనివల్ల ఉత్పత్తి అయ్యే టైల్స్‌ కూడా పెద్దగా ఖరీదు చేయవని పెంటాటోనిక్‌ వ్యవస్థాపకుడు జొహాన్‌ బోడెకర్‌ తెలిపారు. దాదాపు వారం రోజుల పాటు ఈ యంత్రాన్ని ప్రదర్శించారు.

ఈ క్రమంలో తయారైన టైల్స్‌ను నల్లటి గోళాల ఆకారంలో అమర్చి వాటిని అక్కడే అందంగా ఏర్పాటు చేశారు కూడా. అమెరికన్‌ కంపెనీ స్టార్‌ బక్స్‌ యూకే విభాగం ఈమధ్యే పెంటాటోనిక్‌తో చేతులు కలిపింది. తమ కాఫీ షాపుల్లోని ఫర్నిచర్‌ మొత్తాన్ని ట్రాష్‌ ప్రెస్సో లాంటి యంత్రాలు తయారు చేసే రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌తో తయారు చేసేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తమ్మీద చూస్తే ప్లాస్టిక్‌ చెత్తను ఎక్కడో దూరంగా తరలించి రీసైకిల్‌ చేసే పద్ధతికి ట్రాష్‌ ప్రెస్సో ఫుల్‌స్టాప్‌ పెట్టేయగలదన్నమాట!

మరిన్ని వార్తలు