ప్రతి ఒక్కరినీ బిలీనియర్‌గా మార్చే బంగారు గ్రహశకలం

27 Jun, 2019 13:54 IST|Sakshi

సాక్షి : భూమిపై ప్రతి ఒక్కరినీ బిలీనియర్‌గా మార్చగల బంగారు గ్రహశకలాన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దీనికి సైచీ-16 అని పేరు పెట్టారు. ఇది అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య, భూమికి 750 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో తిరుగుతోందని పేర్కొన్నారు. ఈ గ్రహశకలంలో లభించే బంగారం, నికెల్‌ను చూస్తే మతిపోవాల్సిందేనని, అయితే ఈ గ్రహశకలాన్నిఇంకా నిర్ధారించాల్సి ఉందని చెప్పారు. 2022 సంవత్సరానికంతా దీని కచ్చిత గమనాన్ని కనుగొంటామని నాసా ప్రకటించింది.

ప్రపంచంలోనే అధిక బంగారాన్ని ఉత్పత్తి చేస్తూ టైటాన్‌ ఆఫ్‌ గోల్డ్స్‌ అనిపించుకుంటున్న బడా కంపెనీలు భూమ్మీద భవిష్యత్‌ అవసరాలకోసం కావాల్సినంత బంగారాన్ని కచ్చితంగా ఉత్పత్తి చేయలేరు. రాబోయే దశాబ్దాలలో వీరు నిజమైన గోల్డ్‌ టైటాన్లుగా నిలబడాలంటే భూమిని వదిలిపెట్టి అంతరిక్షం వైపు చూడాల్సిందే. ఇటువంటి పరిస్థితులలో అనుకోని అదృష్టంలా బంగారు గ్రహశకలం సైచీ-16 కంటపడింది.

21 సెంచరీలో అంతరిక్షాన్ని సాధిస్తామా? 
మనం నిజంగానే బంగారాన్ని అంతరిక్షం నుంచి తీయగలమా ? మన దగ్గర అంత సాంకేతికత ఉందా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే అయినా మున్ముందు ఈ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు రాయల్‌ ఆస్ట్రనామికల్‌ సొసైటీ అధ్యక్షుడు జాన్‌ జార్నెకీ. అంతరిక్షంలో మన ప్రయాణం సులువుగా సాగడానికి మహా అయితే ఓ 25 సంవత్సారాలు పట్టొచ్చు, అలాగే అంతరిక్షాన్ని కమర్శియల్‌గా ఉపయోగించుకోవడానికి మాత్రం 50 సంవత్సారలు ఆగాల్సిందేనని చెప్పారు. అంతరిక్షాన్ని అందుకోవడం రెండు కారణాల మీద ఆధారపడుతుంది. ఒకటి మన ఆర్థిక వెసులుబాటు, రెండు మన స్పేస్‌ టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్‌ కావడం. అలాగే ఈ ప్రపంచంలో మనం కేవలం ఒంటరి కాదు. ఇంకా మనకు తెలియని ఎన్నో శక్తులు ఈ అంతరిక్షంలో ఆదిపత్యానికి అడ్డురావచ్చు. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇప్పుడ మనం చేస్తున్నదంతా గ్రౌండ్‌వర్క్‌ మాత్రమే. సరైన మౌళిక సదుపాయాలు ఉంటే కచ్చితంగా సాధించి తీరుతామని అంటున్నారు.

తదుపరి పెట్టుబడుల కేంద్రం అంతరిక్షం
సైచీ-16 గ్రహశకలాన్ని అందుకుంటే అంతరిక్షంలో బంగారు అన్వేషనకు ఇదే మొదటి దశ అవుతుంది. అలాగే భూమికి దగ్గరగా వెళ్లే గ్రహశకలాలలో కూడా ఇతర ఖనిజాలను వెలికితీయవచ్చు. ముఖ్యంగా అరుదైన లోహాల వనరులను కలిగి ఉన్న చంద్రుడు తదుపరి అంతరిక్ష మైనింగ్ కార్యకలాపాలకు ప్రధానకేంద్రం అవుతాడు. ఇప్పటికే అంతరిక్ష మైనింగ్‌ మార్కెట్‌ ఏర్పడింది. భారీ ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. మైనింగ్‌కు అనుగుణంగా స్పేస్‌క్రాఫ్ట్‌లను డిజైన్‌ చేయడంపై తలమునకలై ఉన్నారు. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ డిజైన్‌ సెగ్మెంట్‌లో ఖర్చు సగానికి సగం తగ్గితేనే అంతరిక్షంలో పెట్టుబడులకు బడా కంపెనీలు ముందుకు వస్తాయి. అంతరిక్ష మైనింగ్‌ అనేది 25-50 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా జరగొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ పెట్టుబడులు కోసం అన్వేషణలు మొదలయ్యాయి. మోర్గాన్‌ స్టాన్లీ అంచనా ప్రకారం 350 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టారు. 2040 నాటికి ఈ సంఖ్య 2.7 ట్రిలియన్స్‌కు చేరుకోవచ్చు. అయితే బడా కంపెనీలను ఈ దిశగా ఉత్సాహ పరిచి అడుగులు వేయడానికి సైచీ-16 మరింత కీలకంగా మారనుంది. 

మొదటి గోల్డ్‌ కింగ్‌ ఎవరు?
ప్రపంచ శక్తిగా మారుతున్న చైనా ఈ దిశగా ముందే అడుగు వేసి ఉంటుంది.  ఈ పోరులో ఆధిపత్యాన్ని సొంతం చేసుకునే దిశలో సైతం ముందుంది. సహజవనరుల కంపెనీలపై దానికున్న నియంత్రణ, విపరీతంగా పెరుగుతున్న ఆ దేశ సాంకేతిక అభివృద్ధి చైనాకు సానుకూల అంశాలు. అగ్రరాజ్యం అమెరికా మాత్రం తన ఆలోచనను చెప్పనప్పటికీ ప్రయత్నాలు చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అయితే నాసాకు ప్రస్తుతం అంతరిక్ష అన్వేషణ, సైంటిఫిక్‌ మిషన్స్‌పైనే ఆలోచన ఉందని, చైనా మాత్రం అంతరిక్ష వాణిజ్య వ్యాపారంపై దీర్ఘకాల దృష్టితో ఉందని అభిప్రాయపడుతున్నారు. 

యూరపియన్‌ యూనియన్‌ కూడా ఈ రేసులో ఉంది. 2025 సంవత్సరానికంతా చంద్రునిపై మైనింగ్‌ మొదలు పెట్టాలని యూరోసన్‌ అనే దిగ్గజ గోల్డ్‌మైనింగ్‌ ఏజెన్సీతో యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక అతి చిన్నదేశమైన లక్సెంబర్గ్‌లో అంతరిక్షంలో మైనింగ్‌కోసం ఏకంగా10 కంపెనీలు రిజిస్టర్‌ చేసుకున్నాయి. జపాన్‌కు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధనా సంస్థ లూనార్‌ ఆర్బిట్‌ని 2020 సంవత్సరానికి సిద్ధం చెస్తోంది. ఏమైతేనేం ఎవరైతే బంగారానికి కొత్త దేవుళ్లు కావాలనుకుంటున్నారో వారే మొదట మన బంగారు గ్రహశకలం సైచీ-16ను అందుకుంటారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా