గూగుల్‌ ఎర్త్‌ కొత్త వెర్షన్‌పై లుక్కేయండి

20 Apr, 2017 02:43 IST|Sakshi
గూగుల్‌ ఎర్త్‌ కొత్త వెర్షన్‌పై లుక్కేయండి

గూగుల్‌ ఎర్త్‌ గురించి మీకు తెలుసుగా... అదేనండీ.. కంప్యూటర్‌ తెరపై ప్రపంచం మొత్తాన్ని మీ కళ్లముందు ఉంచే అప్లికేషన్‌!.. ఆ.. తెలుసు అయితే ఏంటి? ఈమధ్య కాలంలో ఎప్పుడైనా దీన్ని వాడారా? లేదంటే వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకుని ఓ లుక్కేయండి! ఏంటబ్బా అంత స్పెషల్‌? అంటారా..? చాలానే ఉన్నాయి. మచ్చుకు కొన్ని చూద్దామా? ఓకే.. లెట్స్‌ స్టార్ట్‌. కొత్త గూగుల్‌ ఎర్త్‌ను ఓపెన్‌ చేయగానే.. స్క్రీన్‌ పై ఎడమవైపున ఓ బుల్లి డైస్‌ లాంటిది కనిపిస్తుంది. కర్సర్‌ను దానిపై కదిలిస్తే ఐ ఆమ్‌ ఫీలింగ్‌ లక్కీ అని ఉంటుంది. ఒకసారి దాన్ని క్లిక్‌ చేయండి.

భూ ప్రపంచంపై ఉన్న ఎన్నో వింతలూ విడ్డూరాల గురించి మీకు ఒక్కటొక్కటే తెలుస్తూంటుంది. వికీపీడియాలోనూ ఇలాంటివి ఉంటాయిగా? ఉంటాయి కానీ.. వాటి పేర్లు తెలిస్తేగానీ వెతుక్కోలేము. ఎర్త్‌లోనైతే క్లిక్‌ చేస్తే చాలు.. బోలెడంత సమాచారం. అలా అలా వచ్చేస్తూంటుంది. ఒకటా.. రెండా దాదాపు 20 వేల ప్రదేశాలు, వింతల తాలూకూ సమాచారం ఉంది మరి! అంతేనా అనొద్దు.. దుబాయిలోని అట్లాంటిస్‌ హోటల్‌ మొదలుకొని ప్రపంచంలోని 21 వింతలను వీఆర్‌లో చూసేందుకూ వీలు కల్పిస్తోంది ఈ కొత్త వెర్షన్‌ గూగుల్‌ ఎర్త్‌. అమెరికా నేషనల్‌ పార్కులలో ఆన్‌లైన్‌లోనే తిరుగుతూ ఒక్కో అంశం గురించి తెలుసుకోవాలన్నా... చింపాంజీ పరిశోధకురాలు జేన్‌ గోడాల్‌తో కలిసి టాంజానియాలో విహరించాలన్నా సాధ్యమే. వాయేజర్‌ బటన్‌ను నొక్కితే చాలు.. బీబీసీ ఎర్త్‌ కార్యక్రమాలు, ఇతర టీవీ డాక్యుమెంటరీల సాయంతో ఆయా ప్రాంత విశేషాలను వివరించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. అప్‌డేట్‌ చేసిన గూగుల్‌ ఎర్త్‌ అప్లికేషన్‌ ప్రస్తుతం వెబ్‌కు మాత్రమే పరిమితం. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లకు మరో వారం రోజుల్లో... ఐఫోన్‌ వినియోగదారులకు అతి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని గూగుల్‌ చెబుతోంది!
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు