రోడ్డుపై నోట్ల వరద : జనం పరుగులు

15 Dec, 2018 20:12 IST|Sakshi

అకస్మాత్తుగా రోడ్డుపై  నోట్ల వరద

పరుగులు తీసిన జనం 

భారీ ట్రాఫిక్‌ జాం,  ఢీకొన్న వాహనాలు

ముందుగానే పలకరించిన   క్రిస్మస్‌ తాత అంటూ జోకులు

అమెరికాలో అనూహ్యంగా చేతికి చిక్కిన క్యాష్‌తో కొంతమంది క్రిస్మస్‌కు ముందే సంబరాలు చేసుకున్నారు. అవును, ఒకపక్క మంచు వర్షం..మరోపక్క నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వరద కురుస్తోంటే.. ఆహా ఏమి నా భాగ్యమూ అంటూ  జనం ఎగబడ్డారు.  చేతికి దొరికినంతా దక్కించుకుని చెక్కేసారు. అమెరికాలోని న్యూజెర్సీ హైవేపై ఈ ఘటన జరిగింది. అటు  ఈ ఘటనపై ట్విట్టర్‌లో వీడియోల వర్షం కురిసింది. దీంతో అయ్యో, సమయానికి తాము అక్కడ లేకపోయామే అంటూ మరికొంతమంది నెటిజన్లు వాపోయారు.

సాయుధ పహరాతో వెళుతున్న ఏటీఎంలకు నగదు సరఫరా చేసే బ్రింక్స్ వ్యాను  తలుపులు ఆకస్మాత్తుగా  తెరుచుకోవడంతో ఒక్కసారిగా రోడ్డు మీద కరెన్సీ వరద పారింది. దీంతో జనం ఉరుకులు పరుగులు తీశారు. విపరీతమైన రద్దీలో కూడా కార్లు ఎక్కడపడితే అక్కడ ఆపి మరీ నోట్లవేటలో పడ్డారు. దీంతో  భారీ  ట్రాఫిక్‌ జాం ..అంతేకాదు కొన్నివాహనాలు అదుపు తప్పి ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి.

బ్రింక్స్ వ్యానులో నుంచి రెండు బ్యాగులు కిందపడిపోయి నోట్లు బయటకు వచ్చాయి. ఒక దాంట్లో 3.7 లక్షలు, మరోదాంట్లో 1.4 లక్షలు.. మొత్తం 5.1 లక్షల డాలర్లు ఉన్నట్టు బ్యాంకు అధికారులు చెప్పారు. బ్రింక్స్ సిబ్బంది, దారినపోయేవారు కలిసి ఎట్టకేలకు సుమారు 2 లక్షల డాలర్లు అక్కడికక్కడే సేకరించారు. అలాగే  కొంతమంది నిజాయితీపరులు  తమకు దొరికిన నగదును పోలీసు స్టేషన్‌లో అప్పగించారు.  అయితే ఇలా అందిన డబ్బు కేవలం 11 వేల డాలర్లేనట.  దీంతో మిగిలిన సొమ్ము ఎలా తేవాలిరా బాబూ అని తలలు పట్టుకోవడం  అధికారులు వంతు అయిందిట.

మరిన్ని వార్తలు