కోట్లు ఖరీదైన కారు.. కొన్న 20 నిమిషాల్లోనే

26 Jun, 2020 09:29 IST|Sakshi

లండన్‌ : బ్రిటన్‌కు చెందిన ఒక వ్యక్తి రెండు కోట్ల రూపాయల ఖరీదైన లగ్జరీ కారు కొన్నాడు. అంత ఖరీదు చేసే కారు కొన్నానన్న ఆనందంలో కారును స్టార్ట్‌ను చేసి రోడ్డు మీద రయ్యిమని దూసుకెళ్లాడు. ఇంతలో కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో కారును పక్కకు ఆపి ఇలా దిగాడో లేదో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఇంకేముంది 2 కోట్ల రూపాయలు పెట్టి కొన్న కారు 20 నిమిషాలు కాకుండానే తుక్కుతుక్కుగా మారింది. లోకంలో తనకంటే దురదృష్టవంతుడు మరెవరు ఉండరని అని తెగ బాధపడిపోయాడు. ఈ విచారకర ఘటన గురువారం బ్రిటన్‌లోని వేక్‌ఫీల్డ్‌లో చోటుచేసుకుంది.
(మరో ఇండో-అమెరికన్‌కు కీలక పదవి!)


వివరాలు.. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి తనకెంతో ఇష్టమైన లంబోర్గిని హరికేన్‌ స్పైడర్‌ మోడల్ కారును 2 కోట్లు రూపాయలు పెట్టి కొనుగోలు చేశాడు. షోరూమ్‌ నుంచి కారు డెలివరీ తీసుకొని ఇంటికి వెళ్తుండగా.. మార్గమధ్యలో కారులో సాంకేతిక లోపం తలెత్తింది. కారుకు ఏమైందా అని దిగి పరిశీలించేలోపే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. సమాచారం అందుకున్న వెస్ట్‌ యార్క్‌షైర్‌ పోలీస్‌(డబ్యువైపీ) పోలీసింగ్‌ యూనిట్‌ అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని ఓదార్చడం తప్ప ఇంకేమి చేయలేక పోయారు. దెబ్బతిన్న కారు ఫొటోలను పోలిసింగ్ యూనిట్ తమ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై చాలా మంది నెటిజన్లు స్పందిస్తూ... అయ్యో పాపం.. ;నీ కష్టం ఎవ్వరికీ రాకూడదు'. 'ఈ ప్రపంచంలోనే నీ అంత దురదృష్టవంతుడు ఇంకెవరూ లేరు'. అని కామెంట్స్ పెడుతున్నారు.(భారత్‌కు అండగా అమెరికన్‌ బలగాలు)

మరిన్ని వార్తలు