-

వికలాంగుల కోసం మైండ్ కంట్రోల్ వీల్ ఛైర్

5 Mar, 2016 18:46 IST|Sakshi
వికలాంగుల కోసం మైండ్ కంట్రోల్ వీల్ ఛైర్

అమెరికా శాస్త్రవేత్తలు ఓ కొత్త రోబోటిక్ వీల్ ఛైర్ ను అభివృద్ధి చేశారు. ముందుగా వీల్ ఛైర్ పనిచేసే విధానాన్ని కనుగొనేందుకు కోతులపై ప్రయోగించారు. అవి దాన్ని నడిపే తీరును పరిశీలించారు. కోతుల మెదడులోని ఆలోచనలను బట్టి ఆ ఛైర్ కదలడాన్నిగమనించారు. భవిష్యత్తులో అలాంటి వీల్ ఛైర్లు కండరాల నియంత్రణ, చైతన్యం కోల్పోయిన వ్యక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త, ఆయన బృందం పరిశోధనలు చేస్తోంది. మెదడు సంకేతాలను డిజిటల్ మోటార్ కమాండ్స్‌గా మార్చే ఓ కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను తయారుచేసిన సైంటిస్టులు.. అవి వీల్ ఛైర్ కదలికలను నియంత్రించేలా రూపొందించారు.

కోతుల్లో కూడా అచ్చం మానవచేష్టలే ఉంటాయని ఇంతకుముందే ఎన్నోసార్లు నిర్ధారించారు. అందుకే ఈ వీల్ ఛైర్‌ను ముందుగా కోతులతో ప్రయోగించి చూశారు.  వాటి  మెదడులో కదలికలు, స్పర్శను తెలిపే న్యూరాల్ల పనితీరును ఇంటర్ ఫేస్ సంకేతాల ద్వారా రికార్డు చేశారు. ఆలోచనలను బట్టి కోతులు వాటి లక్ష్యం దిశగా కదలడాన్ని తెలుసుకునేందుకు ఓ ద్రాక్షపళ్ల గిన్నెను వాటి ముందుంచారు. వీల్ ఛైర్ కదిలే విధానం, వాటి మెదడు చర్యలు ఒకేలా ఉండటాన్ని కంప్యూటర్ ద్వారా పరిశీలించారు. కోతుల్లో మెదడు పనిచేస్తున్న తీరు, వీల్ ఛైర్ కదిలే విధానం ఒకేలా ఉందని తేలింది. దీంతో భవిష్యత్తులో పక్షవాతం, వెన్నుకు సంబంధించిన వైకల్యాలతో బాధపడేవారికి, కండరాల నియంత్రణ, చైతన్యం కోల్పోయినవారికి ఈ మనో నియంత్రిత వీల్ ఛైర్ సహకరిస్తుందని అమెరికా డ్యూక్ విశ్వవిద్యాలయం న్యూరో ఇంజనీరింగ్ సెంటర్‌కు చెందిన మిగ్యూల్ నికోలస్ తెలిపారు. అయితే కనీస కదలికలు కూడా లేనివారికి మాత్రం ఇది పెద్దగా పనికొచ్చే అవకాశం ఉండదన్నారు.

మరిన్ని వార్తలు