ఛూ మంత్ర గాలి!

26 Sep, 2016 02:43 IST|Sakshi
ఛూ మంత్ర గాలి!

తెలుగు రాష్ట్రాలను ఇప్పుడైతే వర్షాలు ముంచెత్తుతున్నాయిగానీ.. అప్పుడప్పుడూ మనమూ నీటిచుక్క కోసం అంగలార్చేవాళ్లమే. ఒకవేళ నీటి కొరత లేదనుకున్నా... దొరికే నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందన్నది డౌటే. మన దేశంలోనే కాదు.. ఆఫ్రికా మొదలుకొని చాలాచోట్ల ఇదే పరిస్థితి. అందుకే నీటి కాలుష్యాన్ని తొలగించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. ఫొటోలో కనిపిస్తోందే.. ఈ గాడ్జెట్ ఒక అడుగు ముందుకేసి... గాల్లోంచి నీటిని సృష్టిస్తుంది. అన్ని రకాలుగా శుద్ధి చేసి అందిస్తుంది కూడా. ఇందులో ఆశ్చర్యపోయేందుకు ఏమీ లేదు.
 
 మన చుట్టూ ఉన్న గాల్లో ఎంతో కొంత తేమ ఉంటుందని మనకు తెలుసుకదా... ఆ తేమను ప్రత్యేకమైన టెక్నాలజీ, ఏర్పాట్ల ద్వారా ఒడిసిపడుతుందీ పరికరం. ఇజ్రాయెల్‌కు చెందిన వాటర్ జెన్ అనే కంపెనీ ఈ పరికరాన్ని తయారు చేసింది. కొంచెం కరెంటుతో చుట్టూ ఉన్న గాలిని పీల్చుకోవడం... అందులో ఉన్న తేమను వేరు చేసి, శుద్ధి చేసి అందించడం.. ఇదీ ఈ గాడ్జెట్ చేసే పని. వాటర్ జెన్ ప్రస్తుతం మూడు సైజుల్లో ఈ నీటి జనరేటర్లను తయారు చేస్తోంది. ఫొటోలో కనిపిస్తున్న జనరేటర్ తగిన ఉష్ణోగ్రత, తేమశాతం ఉన్నప్పుడు రోజుకు దాదాపు 3120 లీటర్ల నీటిని అందిస్తుంది. దీనికంటే కొంచెం చిన్నసైజుల్లో మరో రెండు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వార్తలు