పాశ్చాత్య దేశాల్లో కొత్త ధోరణి..

29 Oct, 2017 19:28 IST|Sakshi

స్పెయిన్‌లో అంతర్భాగమైన కేటలోనియా ప్రాంతం అక్టోబర్‌ ఒకటి రిఫరెండం తర్వాత స్వాతంత్ర్యం ప్రకటించుకుని సంచలనం సృష్టించింది. పొరుగు ఐరోపా దేశాలైన ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ మాదిరిగా స్పెయిన్‌లోని నాలుగు కోట్ల డెబ్బయి లక్షల ప్రజలంతా ఒకే భాష మాట్లాడరని, కాటలోనియా ప్రాంతంలోని 76 లక్షల మంది భాష కేటలాన్‌ అనే విషయం ఈ సంక్షోభం తర్వాత ప్రపంచ ప్రజలకు తెలిసింది. స్పెయిన్‌ సైనిక నియంత జనరల్‌ ఫ్రాంకో పాలనలో కేటలాన్‌ భాష వినియోగంపై నిషేధం విధించారు. తర్వాత కూడా స్పానిష్‌ భాషను కేటలాన్లపై రుద్దారు. ప్రత్యేక భాష, సంస్కృతుల కారణంగా 20వ శతాబ్దంలో వేర్వేరు సందర్భాల్లో కేటలోనియాకు స్వయంప్రతిపత్తి లభించింది. ప్రస్తుతం కేటలాన్‌ భాష అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు ఖర్చు చేస్తున్నారు.

అయినా, స్వతంత్రదేశంగా అవతరించాలని కేటలాన్లు కోరుకుంటున్నారు. సాధారణంగా వెనుకబడిన ప్రాంతాలు, దోపిడీకి గురి అయ్యే ప్రాంతాల జనమే తాము విడిపోతామంటూ ఉద్యమిస్తారు. ఇందుకు భిన్నంగా బాగా అభివృద్ధిచెందిన, సంపన్న ప్రాంతాల ప్రజలే ‘వేర్పాటు’ కోరుకుంటన్నారనడానికి ఉదాహరణ కేటలోనియా. స్పెయిన్‌లో ఈశాన్య మూల ఇటలీకి ఆనుకుని, మధ్యధరాసముద్రతీరంలో ఉన్న కేటలోనియా విస్తీర్ణం 32 వేల చదరపు కిలోమీటర్లు. వైశాల్యం, సొంత భాష, చెప్పుకోదగ​‍్గ జనాభా, - ఈ అంశాలే స్వతంత్రదేశంగా అవరించాలన్న కేటలాన్ల ప్రజాస్వామిక ఆకాంక్షకు కారణాలు కాదు. అంతర్భాగంగా ఉండి నష్టపోతున్నామనేదే వారి బాధ.

16 శాతం జనాభాతో ఐదో వంతు సంపద సృష్టిస్తున్న కేటలోనియా!
కేటలోనియాను స్పెయిన్‌ దోపిడీ చేస్తోంది- అనేది స్వాతంత్ర్య పోరాటం చేస్తున్న ప్రజల నినాదాల్లో ఒకటి. ఆర్థికంగా, పారిశ్రామికంగా ఎనలేని అభివృద్ది సాధించిన కేటలోనియా నుంచి పన్నుల రూపంలో భారీగా సొమ్ము సేకరిస్తున్న స్పెయిన్‌ సర్కారు అందులో స్వల్ప మొత్తాన్ని మాత్రమే తిరిగి ఈ అటానమస్‌ ప్రాంతంపై ఖర్చుచేస్తోంది. స్పెయిన్‌లో అంతర్భాగంగా ఉండి ఇలా నష్టపోయేకంటే వేరుపడడమే మేలని కేటలాన్లు బలంగా నమ్ముతున్నారు. అదీగాక, అమెరికా, ఐరోపా నగరాలకు దీటైన బార్సిలోనా ఉన్న కేటలోనియా ప్రజలను స్పెయిన్‌ రాజ్యాంగం ప్రత్యేక జాతిగా గుర్తించింది. లక్ష కోట్ల 20 వేల డాలర్ల(1.2 ట్రిలియన్‌ డాలర్లు)స్పెయిన్‌ ఆర్థిక వ్యవస్థలో ఐదో వంతు వాటా కేటలోనియా వల్లే వస్తోంది. దేశంలోని పారిశ్రామిక ఉత్పత్తులు, ఎగుమతుల్లో కేటలోనియా వాటా 25 శాతం. మాడ్రిడ్‌లోని కేంద్ర సర్కారుకు తనకు ఇచ్చే అభివృద్ధి నిధుల కన్నా 1200 కోట్ల డాలర్లు ఎక్కువ పన్నులు, సుంకాల రూపంలో చెల్లిస్తోంది కేటలోనియా.

కేటలోనియా ఒక్కటే కాదు, కొన్ని ఐరోపా దేశాల సంపన్న ప్రాంతాలదీ ఇదే డిమాండ్‌!
మిగతా ప్రాంతాలతో పోల్చితే అభివృద్ధి, సంపదలో చాలా ముందున్నాగాని కేటలోనియా మాదిరిగానే స్వాతంత్ర్యం కావాలంటున్న అనేక ప్రాంతాలు పలు ధనిక, పారిశ్రామిక ఐరోపా దేశాల్లో ఉన్నాయి. యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) ప్రధాన కార్యాలయం(బ్రసెల్స్‌) ఉన్న బెల్జియంలోని ఫ్లాండర్స్‌ ప్రాంతం కూడా కేటలోనియా మాదిరిగానే బాగా ముందుకెళ్లింది. ఆధునిక వాణిజ్యానికి జన్మస్థలాల్లో ఒకటైన ఫ్లాండర్స్‌ ప్రజల తలసరి స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) ఈయూ దేశాల పౌరుల సగటు కన్నా 120 శాతం ఎక్కువ. అందుకే  ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చాక జరిగిన ఎన్నికల్లో ఫ్లాండర్స్‌కు  స్వాతంత్ర్యం సాధిస్తామని హామీ ఇచ్చిన వేర్పాటువాద పార్టీకి చెప్పుకోదగ్గ ఓట్లొచ్చాయి. పొరుగున ఉన్న జర్మనీలో అన్ని రంగాల్లో ముందున్న బవేరియా రాష్ట్రం స్వతంత్ర దేశంగా మారితే పది అగ్రగామి ఈయూ దేశాలను అధిగమిస్తుందని అక్కడి(బవేరియా) ప్రభుత్వమే చెబుతోంది. బవేరియా పార్టీ నాయకత్వాన స్వాతంత్ర్యం కోసం డిమాండ్‌ తరచు వినిపిస్తోంది.

ఇటలీలో మహానగరాలు మిలన్‌, వెనిస్‌లు ఉన్న లొంబార్డీ, వెనెటో ప్రాంతాలు కూడా స్వాతంత్ర్యం కోసం జనాభిప్రాయసేకరణ జరపాలని తీర్మానించాయి. అమెరికాలో పెద్ద, సంపన్న రాష్ట్రాలైన కేలిఫోర్నియా, టెక్సస్‌లో కూడా వేర్పాటు డిమాండ్లు అప్పుడప్పుడూ ముందుకొస్తున్నాయి. కమ్యూనిస్టుల పాలనలో చెకొస్లేవియాగా అనేక దశాబ్దాలు కొనసాగిన దేశంలోని సంపన్న ప్రాంతం చెక్‌ వేరుపడతానని ప్రకటించగానే  స్లొవేకియా ప్రాంత ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. రెండుగా చీలిపోయాక స్లొవేకియా కూడా కొంత అభివృద్ధి సాధించింది. బాగా వెనుకబడిన అల్పసంఖ్యాకవర్గాలు జాతి వివక్షను కారణంగా చూపి ‘వేర్పాటు’ డిమాండ్లు చేస్తాయనేది సాధారణ నమ్మకం. ప్రపంచీకరణ ఇలాంటి సూత్రీకరణలను తప్పని నిరూపిస్తోంది. అందుకే ‘కలిగిన’ ప్రాంతాల నుంచి వేర్పాటు డిమాండ్లు ఎదుర్కొంటున్న అనేక పాశ్చాత్య దేశాలు కేటలోనియాలో చివరికి ఏం జరుగుతుందా అని ఉత్కంఠతో చూస్తున్నాయి.

మరిన్ని వార్తలు