100 రోజుల తరువాత తెరుచుకున్న న్యూయార్క్‌

8 Jun, 2020 13:12 IST|Sakshi

వాషింగ్టన్‌ : అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్‌గా మారిన న్యూయార్క్‌ సిటీ ఊపిరి పీల్చుకుంది. గడిచిన వారంరోజులుగా అక్కడ ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. దీంతో సుమారు మూడు నెలల అనంతరం న్యూయార్క్‌ సిటీలో కార్యక్రమాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రపంచ వ్యాణిజ్య నగరంగా పేరొందిన న్యూయార్క్‌లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించిన విషయం తెలిసిందే. వైరస్‌ ధాటికి కేవలం ఒక్క నగరంలోనే దాదాపు 22వేలకుపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 1న తొలి కేసు నమోదైన దగ్గర్నుంచి నెల రోజుల్లోనే వైరస్‌ ధాటికి అంతటి మహానగరం కకావికలమైపోతోంది. ఈ క్రమంలోనే మే చివరి వారం నుంచి కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టగా.. సోమవారం నాటికి  కొత్త మృతుల సంఖ్య జీరోకి చేరింది. దీంతో 100 రోజుల పాటు మూతపడ్డ నగరం తెరుచుకుంది. ప్రభుత్వం విధించిన ఆంక్షలను పాటిస్తూ మాల్స్‌, దుకాణాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. (కరోనా పోరులో విజయం: సంబరపడొద్దు)

ఇక వైరస్‌ తిరిగి వ్యాప్తి చెందకుండా ప్రజలంతా ముఖాలను తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి, ఆరు మీటర్ల ఎడం పాటించాలని నిబంధన విధించింది. చాలాకాలం తరువాత షాపింగ్స్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో న్యూయార్క్‌ నగర వీధుల్లో పౌరులు స్వేచ్ఛగా విహరించారు. కాగా న్యూయార్క్ సిటీలో మార్చి 11న మొదటి కరోనా మరణం సంభవించింది. అనంతరం క్రమంగా ఈ సంఖ్య పెరిగింది. ఏప్రిల్ 7న అత్యధికంగా 590 మంది కొవిడ్-19 కాటుకు మరణించారు. తర్వాత మరణాల సంఖ్య క్రమంగా తగ్గింది. గత నెల 9వ తేదీన వందలోపు మరణాలు నమోదవ్వగా.. గత శుక్రవారం నుంచి ఒక్కరు కూడా మృత్యువాత పడలేదని న్యూయార్క్  ఆరోగ్యశాఖ ప్రకటించింది.

మరోవైపు అమెరికాలో కోవిడ్‌–19 కేసుల పెరుగుదల ఆగడం లేదు. ప్రతీ రోజూ సగటున 20 వేల వరకు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రపంచదేశాల్లో నమోదైన కేసుల్లో 30శాతం అమెరికాలోనే నమోదయ్యాయి. ప్రస్తుతం 20 లక్షలకు చేరువలో ఉన్నాయి. మృతుల్లో కూడా అగ్రరాజ్యమే మొదటి స్థానంలో ఉంది. ఆ దేశంలో  మృతుల సంఖ్య లక్షా 12 వేలు దాటేసింది.

మరిన్ని వార్తలు