న్యూయార్క్‌.. నిద్రలేని నగరం

13 Apr, 2020 04:25 IST|Sakshi
న్యూయార్క్‌లో యుద్ధప్రాతిపదికన నిర్మిస్తున్న ప్రత్యేక ఆస్పత్రి

కరోనా కాటుతో జనం విలవిల

న్యూయార్క్‌: గుట్టలు గుట్టలుగా శవాలు, సామూహిక దహనాలు, ఆస్పత్రులు చాలడం లేదు, వైద్యులు తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. వాణిజ్యానికి పెట్టింది పేరైన నగరంలో ఇప్పుడు మృత్యువు విలయతాండవం చేస్తోంది. ఎందుకిలా జరిగింది?  

అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌కి నిద్రలేని నగరమని పేరు. ఇప్పడు నిజంగానే ఆ నగరానికి కంటి మీద కునుకు రావడం లేదు. కంటికి కనిపించని శత్రువు మింగేస్తోంది. కోవిడ్‌–19 ఉక్కు పిడికిట్లో న్యూయార్క్‌ విలవిలలాడుతోంది. ప్రపంచంలో మరే ఇతర దేశంలో కూడా కరోనా ఈ స్థాయిలో భయాందోళనలు రేపలేదు. యూరప్‌లోని స్పెయిన్, ఇటలీల కంటే న్యూయార్క్‌ పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. మార్చి 1న తొలి కేసు నమోదైన దగ్గర్నుంచి నెల రోజుల్లోనే వైరస్‌ ధాటికి అంతటి మహానగరం కకావికలమైపోతోంది. దీనికి ఎన్నో కారణాలున్నాయి.

న్యూయార్క్‌ వాణిజ్య రాజధాని కావడంతో రాకపోకలు ఎక్కువ. ఇసుక వేస్తే రాలనంత జనసమ్మర్థంతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. మొత్తం జనాభా 86 లక్షలైతే, ఒక చదరపు కిలోమీటర్‌కి 10 వేల మంది నివసిస్తారని అంచనా. జనాభా ఎక్కువ కావడంతో సబ్‌ వేలు ఎక్కువగా నిర్మించారు. ప్రయాణాలన్నీ అండర్‌ గ్రౌండ్‌ రైళ్ల ద్వారానే జరుగుతాయి. అందుకే ఇక్కడ భౌతిక దూరం పాటించడం అంత సులువు కాదు. నగరాన్ని ఏటా 6 కోట్ల మంది సందర్శిస్తుంటారు. అందుకే కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపించింది. న్యూయార్క్‌లో ఇప్పటివరకు 1,88,694 కేసులు నమోదు కాగా, 9,385 మంది మృతి చెందారు.

వెనుకబడిన ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం
పేరుకే మహానగరం. కానీ, న్యూయార్క్‌లో సామాజిక ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువ. బ్రాంక్స్, క్వీన్స్‌ వంటి ప్రాంతాల్లో ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల నుంచి వచ్చిన వారు. బ్రాంక్స్‌లో 84 శాతం నల్లజాతీయులే ఉన్నారు. ఇక్కడ సరైన వైద్య సదుపాయాలు లేవు. అందుకే వీరిలో ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ. వీళ్లలో అత్యధికులు సర్వీసు వర్కర్లుగా ఉన్నారు. నర్సులు, సబ్‌వే సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లు, మాల్స్‌లో పనిచేసే సిబ్బంది.. ఇలా న్యూయార్క్‌లో ఉపాధి పొందుతున్న వారిలో 79 శాతం ఫ్రంట్‌ లైన్‌ ఉద్యోగులే. వాళ్లపై కరోనా సులభంగా పంజా విసిరింది. ఆ ప్రాంతాల్లోనే కల్లోలం రేపుతోంది.

నిర్లక్ష్యమే కొంప ముంచిందా?
కరోనా వైరస్‌ వచ్చిన మొదట్లో ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్య సదుపాయాలు ఉన్న తమకేమీ కాదన్న ధీమాలో ఉంది. మార్చి 1న ఒక కేసు, ఆ మర్నాడు మరో కేసు నమోదయ్యాయి. అయితే ఈ స్థాయిలో కరోనా కమ్మేస్తుందని ఎవరూ ఊహించలేదు. వైరస్‌ వచ్చిన రెండు వారాల తర్వాత మార్చి 16న న్యూయార్క్‌లో స్కూళ్లు, బార్లు, రెస్టారెంట్లు మూసివేస్తూ నగర మేయర్‌ బిల్‌ బ్లాసియో నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత మరో వారానికి మార్చి 22న గవర్నర్‌ ఆండ్రూ క్యూమో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ ప్రకటించి ప్రజల్ని ఇళ్లలోనే ఉండాలని పిలుపునిచ్చారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఎంతోమంది ఆరోగ్య నిపుణులు మహా విపత్తు ముంగిట్లో ఉన్నామని చెబుతున్నా గవర్నర్, మేయర్‌ మధ్య లాక్‌డౌన్, భౌతిక దూరం వంటి అంశాల్లో సమన్వయం కొరవడింది. అందుకే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు.

మరిన్ని వార్తలు