కరోనా పోరులో విజయం: సంబరపడొద్దు

8 Jun, 2020 09:24 IST|Sakshi

వెల్లింగ్టన్‌ : ప్రాణాంతక కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు కంటిమీద కునుకులేకుండా గడుపుతున్న తరుణంలో న్యూజిలాండ్‌ ఓ శుభవార్తను పంచుకుంది. దేశంలో కరోనా వైరస్‌ను పూర్తిగా కట్టడిచేశామని, పాజిటివ్‌ కేసుల సంఖ్య తొలిసారి ‘జీరో’గా నమోదు అయ్యాయని ఆదేశ వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్‌ వెలుగుచూసిన ఫిబ్రవరి 28 నుంచి జీరో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని తెలిపింది. కఠినమైన లాక్‌డౌన్‌ ఆంక్షలు, ప్రజలు భౌతిక దూరం పాటించడం మూలంగానే వైరస్‌ను కట్టడి చేయగలిగామని స్పష్టం చేసింది. ఇక వైరస్‌పై పోరులో విజయం సాధించిన ఆ దేశ వైద్య విభాగాన్ని ప్రధాని జెసిండా ఆర్డర్న్ ప్రశంసల్లో ముంచెత్తారు. వైద్యుల శ్రమ, కృషి, త్యాగం ఫలితంగానే నేడు విముక్తి లభించిందని అభినందనలు తెలిపారు. ఇదే పోరాట పటిమను మరికొన్నాళ్ల పాటు కొనసాగిస్తామని పేర్కొన్నారు. (కేసులు 70 లక్షలు..మృతులు 4 లక్షలు)

కాగా 50 లక్షల జనాభా గల న్యూజిలాండ్‌లో ఇప్పటి వరకు 1,154 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. కేవలం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మే 22 తరువాత చివరి కేసు అక్కడ నమోదు కాగా.. జూన్‌ 8 నాటికి వైరస్‌ సోకిన చివరి బాధితుడు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యాడు. దీంతో కరోనా ఫ్రీ దేశంగా న్యూజిలాండ్‌ నిలిచింది. కరోనాపై యుద్ధంలో విజయం సాధించిన ఆ దేశానికి పొరుగు దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రపంచ దేశాల నుంచి వ్యక్తమవుతున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కరోనాను పూర్తిగా జయించామని ఇప్పుడే సంబరపడొద్దని ఆ దేశ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో వైరస్‌ తొలుత తగ్గుముఖం పట్టినప్పటికీ మరోసారి బయటపడటం ఆందోళనకరమైని గుర్తుచేస్తున్నారు. అయితే అతి తక్కువ జనాభా కలగడం, ప్రజలు తప్పని సరిగా భౌతికదూరం పాటించడం, కఠిన లాక్‌డౌన్‌ అమలు వంటి అంశాలు ఆ దేశానికి కొంత ఊరటనిస్తున్నాయి. (చిప్పీగర్ల్‌.. జెసిండా)

ఇక కరోనాపై విజయంలో ఆదేశ ప్రధాని జెసిండా ఆర్డర్‌ పాత్ర ఎంతో  కీలకమైనదని ప్రజలు ప్రశంసిస్తున్నారు. వైరస్‌ వెలుగుచూసిన తొలినుంచే లాక్‌డౌన్‌ విధించడం, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంలో జెసిండా విజయవంతం అయ్యారని కొనియాడుతున్నారు. వైరస్‌పై పోరులో ఆమె చూపిన తెగువ, నాయకత్వం పటిమ న్యూజిలాండ్‌ వాసులను సురక్షిత తీరాలకు చేర్చిందని అభినందిస్తున్నారు. ఇక ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా, బ్రెజిల్‌, భారత్‌ లాంటి దేశాలు కరోనా నుంచి బయటపడేందుకు అష్టకష్టాలు పడుతున్న తరుణంలో న్యూజిలాండ్‌ సాధించింది గొప్ప విజయమే అని చెప్పక తప్పదు.

మరిన్ని వార్తలు