కోలుకున్న చివ‌రి క‌రోనా పేషెంట్

29 May, 2020 18:56 IST|Sakshi

వెల్లింగ్ట‌న్‌‌: అనుకోకుండా ముంచుకొచ్చిన‌‌ క‌రోనా విప‌త్తు వ‌ల్ల ఇప్ప‌టికీ ఎన్నో దేశాలు అత‌లాకుత‌లం అవుతున్నాయి. నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతూ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇలాంటి విష‌మ ప‌రిస్థితుల మ‌ధ్య న్యూజిలాండ్‌ దేశం శుభ‌వార్త తెలిపింది. క‌రోనా నుంచి కోలుకున్న చివ‌రి బాధితుడిని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేసిన‌ట్లు వెల్ల‌డించింది. కాగా న్యూజిలాండ్ దేశంలో గ‌త వారం రోజులుగా ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాలేద‌ని అక్క‌డి అధికారులు వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలో బుధ‌వారం క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ చిట్ట‌చివ‌రి పేషెంట్‌ను ఆక్లండ్‌లోని మిడిల్‌మోర్ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. (భూకంపం వచ్చినా ఇంటర్వ్యూ ఆపని ప్రధాని)

న్యూజిలాండ్ ప్ర‌ధాని జెసిండా ఆర్డ‌న్స్ అనుసరించిన విధివిధానాలు, ఆమె సమ‌ర్థ‌వంత‌మైన నాయ‌కత్వమే ప్రాణాంత‌క వైర‌స్‌తో సాగిన పోరాటంలో గెలుపుకు కార‌ణ‌మైంద‌ని ప్ర‌జ‌లు ఆమెకు జేజేలు ప‌లుకుతున్నారు. క‌రోనా ఉనికి క‌న‌బ‌డ‌గానే లాక్‌డౌన్ విధించ‌డం, ఎక్కువ సంఖ్య‌లో ప‌రీక్ష‌లు చేయ‌డం ఈ గెలుపుకు దోహ‌ద‌పడ్డాయంటున్నారు. ఆ దేశంలో ఆరు కరోనా కేసులు న‌మోద‌వ‌గానే దేశ ప్ర‌జ‌లంద‌రూ రెండు వారాల‌పాటు సెల్ఫ్ ఐసోలేట్‌లో ఉండాల‌ని ప్రధాని జెసిండా పిలుపునిచ్చారు. బాధితుల సంఖ్య 28కు చేరుకునే స‌మ‌యానికి విదేశాల నుంచి రాక‌పోక‌ల‌పై నిషేధం విధించారు. అంతేకాక దేశంలో 2,67,435 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించడం విశేషం. ఇప్ప‌టివ‌ర‌కు అక్క‌డ 1504 కేసులు న‌మోద‌వ‌గా 22 మంది చ‌నిపోయారు, మిగ‌తా అంద‌రూ కోలుకున్నారు. (గుక్కతిప్పుకోని ప్రధాని)

మరిన్ని వార్తలు