రెస్టారెంట్‌ వెలుపల వేచిచూసిన ప్రధాని

17 May, 2020 09:43 IST|Sakshi
క్లార్క్‌ గెఫోర్డ్‌తో ప్రధాని జెసిండా(ఫైల్‌ ఫొటో)

వెల్లింగ్టన్‌ : కరోనా కట్టడి కోసం విధించిన నిబంధనలు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్ను రెస్టారెంట్ బయట నిలబడేలా చేశాయి. భౌతిక దూరం నిబంధన కారణంగా రెస్టారెంట్‌లోకి పరిమిత సంఖ్యలో మాత్రమే కస్టమర్లను అనమతిస్తుండటంతో ఈ పరిస్థతి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. ప్రధాని జెసిండా తన కాబోయే భర్త క్లార్క్‌ గెఫోర్డ్‌తో కలిసి శనివారం దేశ రాజధాని వెల్లింగ్టన్‌లోని ఆలివ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అయితే భౌతిక దూరం నిబంధన ప్రకారం రెస్టారెంట్‌లో పలు మార్పులు చేయడంతో.. అప్పటికే కుర్చీలు అన్ని నిండిపోయాయి. దీంతో రెస్టారెంట్‌ నిర్వాహకులు కాసేపు వేచి చేయాల్సిందిగా ప్రధానిని కోరారు. దీంతో ఆమె కుర్చీలు ఖాళీ అయ్యేవరకు సామాన్యుల మాదిరిగా రెస్టారెంట్‌ వెలుపల వేచిచూశారు. ఆ తర్వాత సీట్లు ఖాళీ కావడంతో గెఫోర్డ్‌తో కలిసి లోనికి వెళ్లారు. (చదవండి : కరోనాపై విజయం సాధించాం: జెసిండా అర్డర్న్‌)

ఈ ఘటనపై జెసిండా కార్యాలయం అధికార ప్రతినిధి  ఒకరు స్పందిస్తూ.. ‘కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి విధించిన పరిమితులను ఎవరైనా పాటించాల్సిందే.. ప్రధాని కూడా అందరిలానే నిబంధనలు పాటించారు’ అని తెలిపారు. మరోవైపు కరోనా కట్టడి కోసం జెసిండా తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కరోనా తీవ్రతను ముందుగానే గ్రహించిన ఆమె మార్చిలోనే న్యూజిలాండ్‌కు విదేశీ రాకపోకలపై నిషేధం విధించడంతోపాటుగా.. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేశారు. ఇది చాలా మంచి ఫలితాలు ఇచ్చింది. ఇప్పటివరకు న్యూజిలాండ్‌లో 1,498 కరోనా కేసులు నమోదు కాగా, 21 మంది మరణించారు. అయితే గత ఐదు రోజుల్లో అక్కడ కొత్తగా ఒక్క కరోనా కేసు మాత్రమే నమోదు అయింది. (చదవండి : గుక్కతిప్పుకోని ప్రధాని)

కాగా, రెండు రోజుల కిత్రం దేశవ్యాప్తంగా చాలావరకు లాక్‌డౌన్‌ సడలింపులు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గెపోర్డ్‌తో కలిసి జెసిండా సరదాగా బయటకి వచ్చారు. ఇక, కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట 2018 జూలైలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. 

మరిన్ని వార్తలు