భారత్‌ యూరప్‌ శత్రువు

17 Mar, 2019 04:40 IST|Sakshi

వలసల పేరిట శ్వేతజాతీయుల స్థానాలను లాక్కుంటున్నారు

చైనా, టర్కీ దేశస్తులపైనా క్రైస్ట్‌చర్చ్‌ షూటర్‌ విద్వేషం

క్రైస్ట్‌చర్చ్‌: కొత్త తరహా నాజీ విధానాలు, యూరప్‌ దేశాలకు పెరుగుతున్న వలసలే క్రైస్ట్‌చర్చ్‌ మసీదుల్లో మారణకాండ సృష్టించడానికి తనను పురికొల్పాయని 49 మందిని పొట్టనబెట్టుకున్న దుండగుడు తెలిపాడు. యూరప్‌లో తమ జనాభాను పెంచుకుంటూ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న భారత్, చైనా, టర్కీ దేశాలు యూరప్‌కు శత్రువులని అభివర్ణించాడు. దాడికి పాల్పడే ముందు 28 ఏళ్ల బ్రెంటన్‌ టారంట్‌..‘ది గ్రేట్‌ రిప్లేస్‌మెంట్‌’ పేరిట ఆన్‌లైన్‌లో ఉంచిన పోస్ట్‌లో ఈ జాతి విద్వేష వ్యాఖ్యలు చేశాడు.

శ్వేతేతర వలసదారులు శ్వేతజాతీయుల స్థానాలను ఆక్రమిస్తున్నారని పేర్కొన్నాడు. శ్వేతజాతీయుల గుర్తింపునకు సరికొత్త చిహ్నంగా నిలిచిన ట్రంప్‌కు మద్దతు తెలుపుతున్నానన్న టారంట్‌..జాతీయవాద అతివాదులే తనకు స్ఫూర్తి అని చాటుకున్నాడు. ‘వలసదారులు ఎక్కడి నుంచి వచ్చినా వారిని అంతమొందించాలి. ఇండియా, టర్కీ, రోమా(భారత్‌ నుంచి యూరప్‌కు వలసెళ్లిన సంచార జాతులు),  యూదులు, ఆఫ్రికా దేశాల ప్రజలు మనవాళ్లు కాకున్నా ఇక్కడ నివసిస్తున్నారు. వారిని చంపేయాల్సిందే.

మారణహోమానికి రెండేళ్లుగా ప్రణాళికలు వేస్తున్నా. 2017 ఏప్రిల్‌ లేదా మే నెలల్లో ఫ్రాన్స్‌ లేదా ఇతర ఉత్తర ఐరోపా దేశాల్లో దాడికి పాల్పడాలని అనుకున్నా. మూడు నెలల క్రితమే క్రైస్ట్‌చర్చ్‌ను ఎంచుకున్నా’ అని టారంట్‌ పోస్ట్‌లో పేర్కొన్నాడు. మరోవైపు, క్రైస్ట్‌చర్చ్‌ కాల్పుల తరువాత గల్లంతైన ఏడుగురు భారతీయులు, ఇద్దరు భారత సంతతి వ్యక్తుల జాడ తెలుసుకోవడానికి స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు భారత హైకమిషన్‌ వెల్లడించింది.   

టారంట్‌పై హత్యానేరం..
క్రైస్ట్‌చర్చ్‌ దాడి అనుమానితుడు బ్రెంటన్‌ టారంట్‌పై కోర్టు శనివారం హత్యానేరం మోపింది. ఏ మాత్రం పశ్చాత్తాపం చెందని అతడు అదే అహంకారంతో ‘ఓకే’ అని వెటకారంగా సంకేతాలిచ్చాడు. బెయిల్‌కు కూడా విజ్ఞప్తి చేసుకోలేదు. అతనికి జీవితఖైదు పడే అవకాశాలున్నాయి. టారంట్‌ను పోలీస్‌ కస్టడీకి పంపిన కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్‌ 5కు వాయిదా వేసింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయిన అల్‌ నూర్‌ మసీదు సమీపంలో ఏర్పాటుచేసిన స్మారకం వద్ద ప్రజలు పుష్పాలు ఉంచి నివాళులర్పించారు. క్రైస్ట్‌చర్చ్‌ వచ్చిన ప్రధాని జెసిండా బాధిత కుటుంబాలను ఓదార్చారు.

‘తుపాకీ’ చట్టాలు మారుస్తాం..
దేశంలో తుపాకీ వినియోగ చట్టాన్ని కఠినతరం చేస్తామని న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ప్రకటించారు. క్రైస్ట్‌చర్చ్‌ దాడి అనుమానితుడు చట్టబద్ధంగానే ఆయుధాలు కొనుగోలు చేశాడని తేలింది. టారంట్‌ ఆయుధ కొనుగోలు విషయాలు తెలిశాక ప్రజలు సంబంధిత చట్టంలో మార్పులు కోరుకుంటున్నారని, ఈ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాడికి ముందు ఆన్‌లైన్‌లో విద్వేషపూరిత పోస్టు పెట్టినా కూడా టారంట్‌తో పాటు అరెస్ట్‌ అయిన అతని ఇద్దరు సహచరులపై నిఘా వర్గాల వద్ద సమాచారం లేదని తెలిపారు.
క్రైస్ట్‌చర్చ్‌ కాల్పుల మృతులకు వెల్లింగ్టన్‌లో పుష్పాలతో నివాళులు

>
మరిన్ని వార్తలు