తారల గుహలు.. సాహస దారులు

11 Aug, 2015 12:03 IST|Sakshi
తారల గుహలు.. సాహస దారులు

సాక్షి, స్కూల్ ఎడిషన్: ఆకాశంలో నక్షత్రాల్ని అందుకోవాలనే ఉబలాటం.. అరుదైన ప్రదేశాల్లో సాహస యాత్రలు చేయాలనే ఆరాటం.. ఈ రెండు ఆశలూ ఉన్నవారికి న్యూజిలాండ్‌లోని వైటొమొ గుహలు స్వాగతం పలుకుతాయి. ఆ గుహల లోపలికి వెళ్తే సందర్శకులు వింత అనుభూతికి లోనవడం ఖాయం. ప్రపంచంలోని అనేక చోట్ల గుహలున్నా అరుదైన సాహసాలకు ఇవి పేరెన్నికగన్నవి. ముఖ్యంగా అక్కడ రాతి గోడలపై దర్శనమిచ్చే తారలు (మిణుగురు పురుగులు) మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఇలాంటి అనేక వింతలు కలిగిన ‘వైటొమొ’ గుహలకు సంబంధించిన విశేషాలు ఈరోజు తెలుసుకుందాం...
 
 ఎక్కడున్నాయి..
 న్యూజిలాండ్‌లోని ఉత్తర ద్వీపంలోని కింగ్‌కౌంటీకి సమీపంలో టెకుయిటి అనే పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ గుహలున్నాయి. కొన్ని గుహలోపల నదులు కూడా ప్రవహిస్తుంటాయి. అలాంటికోవకు చెందినదే ఈ ‘వైటొమొ’. స్థానిక మావోరి భాష నుంచి ‘వైటొమొ’ అనే పేరు వచ్చింది. ఆ భాషలో వైటో అంటే నీరు, మొ అంటే గుహ. నీళ్లు ఉండే గుహ అని ‘వైటొమొ’కి అర్థం. వీటిని అక్కడి ప్రభుత్వం పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసింది. ఇక్కడి వింతలను చూడడానికి, సాహసకృత్యాలు చేయడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. దీంతో ఇది న్యూజిలాండ్‌లో అత్యంత ఆదరణ పొందిన పర్యాటక ప్రదేశంగా పేరుపొందింది.
 పురాతన గుహలు..
 ఇక్కడి అన్ని గుహలు అతి పురాతనమైనవి. దాదాపు 3 కోట్ల సంవత్సరాల క్రితం ఇవి ఏర్పడ్డాయని శాస్త్రవేత్తల అంచనా. 19వ శతాబ్దం చివరలో వీటిని స్థానికులు గుర్తించారు. 1910వ సంవత్సరం నుంచి ఇది పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందడంతో అప్పటినుంచే సందర్శకుల రాక పెరిగింది. సముద్రంలోని సున్నపురాయి నిక్షేపాలు నీటి తాకిడికి గురవ్వడం వల్ల ఈ రాతి గుహలు ఏర్పడ్డాయి. మొత్తం 300 వరకు గుహలు ఇక్కడ ఉన్నాయి.
 మిణుగురులే ఆకర్షణ..
  ఈ గుహ అనేక అద్భుతాలతో కూడుకుని ఉన్నప్పటికీ ప్రధానాకర్షణ మాత్రం ఇక్కడి రాతి గోడలపై కనిపించే మిణుగురు పురుగులే. అందరూ వాటిని ఎప్పుడో అప్పుడు చూసి ఉండొచ్చు. కానీ వేలు, లక్షల సంఖ్యలో ఒకేసారి, ఒకేచోట ఇలా   దర్శనమివ్వడం మాత్రం చాలా అరుదు. గుహ లోపలికి వెళ్లినవారు వాటిని చూస్తూ ఆకాశంలో నక్షత్రాలకి దగ్గరగా ఉన్నామనే అనుభూతిని పొందుతారు. నీలి, ఆకుపచ్చ రంగులో మిణుగురులు మెరుస్తూ కనిపిస్తాయి. లోపల చాలాదూరం ప్రయాణించినా ఇవి కనిపిస్తూనే ఉంటాయి. చీకటిలోనే నివసించగలవు కాబట్టి మిణుగురులు ఈ గుహల్లో జీవిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా అక్కడ ఆవాసం ఏర్పర్చుకున్న మిణుగురు పురుగులను కాపాడేందుకు, గుహను సంరక్షించేందుకు సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది.
 భూ గర్భంలోనూ...
 ఈ గుహలోపల ఇంకా అనేక విశేషాలు ఉన్నాయి. లోపలికి వెళ్తే అనేక జలపాతాలు, సున్నపురాతి గోడల మధ్య ఏర్పాటు చేసిన బ్రిడ్జి, మ్యూజియమ్‌లు ఉన్నాయి. అన్నింటికీ మించి గుహ భూ గర్భంలో ప్రవహించే నీటిపై సాగే సాహసాలు మరో ఎత్తు. సముద్రంలో, నదుల్లో పడవలపై విహరించేవారికి భూ గర్భంలోపల ఉన్న ఈ నదిలో పడవ ప్రయాణం మధురానుభూతిని కలిగిస్తుంది. ఈ నీటిలో ఈతకొట్టే సదుపాయం కూడా ఉంది. గుహ బయట ట్రెక్కింగ్‌తోపాటు, దీని పైభాగంలో గుర్రపు స్వారీ చేసే సదుపాయం కూడా ఉంది. ఇటీవల విడుదలైన ఓ చిత్రంలో హీరో రెండు జలపాతాల మధ్య తాడు పట్టుకుని పైకి ఎగబాకుతుంటాడుగా.. అచ్చం అలాంటి సాహసాలు ఇక్కడ నిత్యం అనేక మంది చేస్తుంటారు. ధైర్యం ఉండాలే కానీ గుహ కింది భాగం నుంచి తాడు ద్వారా శిఖరం వరకు చేరుకోవచ్చు. గుహ పైకి దాదాపు 110 మీటర్ల ఎత్తు వరకు ఎగబాకాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో సూచనలివ్వడానికి నిపుణులు దగ్గరే ఉంటారు.
 మరిన్ని ప్రత్యేకతలు..
 గుహ లోపల మాత్రమే కాక బయట కూడా అనేక ఆకర్షణలు ఈ ప్రాంతం సొంతం. గుర్రపుస్వారీ చేస్తూ అందమైన ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఇక్కడ నిర్మించిన మేగ్నఫో నేచురల్ బ్రిడ్జి, అరాన్యు, రౌకురి గుహలు కూడా సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవే కావడంతో ప్రతియేటా భారీ సంఖ్యలో సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు.
 

>
మరిన్ని వార్తలు