కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. 9 మంది మృతి

10 Nov, 2018 11:16 IST|Sakshi

పారడైస్‌ (కాలిఫోర్నియా) : అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా అటవీ ప్రాంతంలో భారీ అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 9 మంది మరణించారని, 6700 నివాసాలు, వ్యాపార సంస్థలు బుగ్గిపాలయ్యాయని  కాలిఫోర్నియా అగ్నిమాపక శాఖ తెలిపింది. మరో 35 మంది కనిపించకుండా పోయారని, ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మంటలు దావానలంలా వ్యాపించడంతో వేలాది ఎకరాలు బూడిదపాలై తీవ్ర నష్టం వాటిల్లందన్నారు. ఆ రాష్ట్ర చరిత్రలోనే ఇదో అతిపెద్ద అగ్నిప్రమాదంగా అభివర్ణించారు.

అటవీప్రాంతానికి సమీపంలోని సుమారు లక్షా 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, మంటలను అదుపుచేసేందుకు దాదాపు 2వేల మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దింపినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 30వేల ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయని వెల్లడించారు. భారీగా ఎగిసిపడుతున్న మంటల కారణంగా చుట్టుపక్కల కిలోమీటర్లమేర దట్టంగా పొగ వ్యాపించింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని పారడైస్‌ నగరంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోంది. ఇది బుధవారం కాల్పుల ఘటన చోటుచేసుకున్న థౌజండ్‌ ఓక్స్‌ నగరానికి సమీపం ప్రాంతం కావడం గమనార్హం. ఈ కాల్పుల ఘటనలో 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మంటలు మాలిబూ నగరానికి సైతం వ్యాపించాయి. ఈ ప్రాంతంలో హాలీవుడ్‌ అగ్ర తారలు ఎక్కువగా నివాసముంటారు. విపరీతమైన గాలులు వీస్తుండడంతో కాలిఫోర్నియా పశ్చిమ ప్రాంతానికి మంటలు వ్యాపిస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు