జాధవ్‌ను విడుదల చేయండి

19 Feb, 2019 06:11 IST|Sakshi
విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన లాయర్‌ హరీశ్‌ సాల్వే, ఇతర భారత ప్రతినిధులు

13 సార్లు కోరినా పాకిస్తాన్‌ దౌత్యసాయం అందించలేదు

పాక్‌ వియన్నా ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించింది

ఐసీజేకు భారత న్యాయవాది హరీశ్‌ సాల్వే విజ్ఞప్తి

హేగ్‌: భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌(48)కు పాకిస్తాన్‌ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ఐసీజే) సోమవారం కోరింది. కుల్‌భూషణ్‌ జాధవ్‌ను వెంటనే విడుదల చేసేలా పాకిస్తాన్‌ను ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. జాధవ్‌పై నమోదైన అభియోగాలను నిరూపించడంలో పాక్‌ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టింది. జాధవ్‌ను కలుసుకునేందుకు కనీసం భారత దౌత్యాధికారిని  పాక్‌ అనుమతించలేదనీ, ఇది వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనంది. గూఢచర్యం, ఉగ్రవాద అభియోగాల కింద దోషిగా తేలుస్తూ పాక్‌ సైనిక కోర్టు జాధవ్‌కు 2017 ఏప్రిల్‌ 10న మరణశిక్ష విధించింది. జాధవ్‌ను పాక్‌ ఇరాన్‌ నుంచి కిడ్నాప్‌ చేసిందన్న భారత్‌.. మరణశిక్షను సవాలు చేస్తూ ఐసీజేను ఆశ్రయించింది. సోమవారం ఐసీజే ముందు భారత్‌ తరఫున వాదనలు వినిపించిన మాజీ సోలిసిటర్‌ జనరల్‌ హరీశ్‌ సాల్వే పాక్‌‡శైలిని తీవ్రంగా ఎండగట్టారు.

ఆర్మీ అధికారులే జడ్జీలు
‘జాధవ్‌ను కలుసుకునేందుకు అనుమతించాలని భారత్‌ 13 సార్లు కోరింది. పాక్‌ వాటిని పట్టించుకోలేదు. కేసును విచారించిన పాక్‌ మిలటరీ కోర్టు జడ్జీలకు న్యాయ శిక్షణ లేదు. కనీసం న్యాయశాస్త్రంలో డిగ్రీ అవసరం లేదు. పాక్‌ మిలటరీ కోర్టులు గత రెండేళ్లలో 161 మంది పౌరులకు మరణశిక్ష విధించాయి. పాక్‌ మిలటరీ కోర్టుల్లో ఆర్మీ అధికారులే జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. వీరు ఆర్మీలోని ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు.  మిలటరీ కోర్టులు పౌరుల్ని విచారించడంపై ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆఫ్‌ జ్యూరిస్ట్స్‌ అభ్యంతరాలు లేవనెత్తినప్పటికీ పాక్‌ రాజ్యాంగాన్ని మార్చి మరణశిక్ష విధిస్తోంది’ అని మండిపడ్డారు.

బలవంతంగా వాంగ్మూలం ఇప్పించారు
జాధవ్‌ భారత గూఢచారి అని ఆరోపిస్తున్న పాకిస్తాన్‌ అందుకు తగ్గ సాక్ష్యాలను మాత్రం సమర్పించలేకపోయిందని సాల్వే విమర్శించారు. ‘ కేసులో జాధవ్‌కు కనీస న్యాయ సాయం అందించడంలో పాక్‌ ఘోరంగా విఫలమైంది. జాధవ్‌కు పాక్‌లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకు లేదు. జాధవ్‌ ఉగ్రవాది అని చెబుతున్న పాక్‌ అందుకు సంబంధించి ఒక్క సాక్ష్యాన్ని సమర్పించలేకపోయింది. ఆయన చేత బలవంతంగా నేరాంగీకార వాంగ్మూలాన్ని ఇప్పించారు. మూడేళ్లుగా జైలులో జాధవ్‌ అనుభవించిన మానసిక క్షోభను, ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన్ను విడుదల చేయాలని ఐసీజేను కోరుతున్నాం’ అని తెలిపారు.

3 నెలల గడువు ఎందుకు?
జాధవ్‌ను 2016, మార్చి 3న అరెస్ట్‌ చేసిన పాకిస్తాన్‌ నెల రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసిందని సాల్వే అన్నారు. ‘విదేశీ పౌరులు గూఢచర్యం అభియోగం కింద అరెస్టయినా వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్‌ 36 ప్రకారం ఆ విషయాన్ని సంబంధిత దేశానికి తెలియజేయాలి. కానీ అరెస్ట్‌పై పాక్‌ మాకు సమాచారమివ్వలేదు. దౌత్యసాయంపై ఒప్పందం ఉన్నప్పటికీ అది వియన్నా ఒప్పందానికి అనుబంధంగానే ఉంది. పాకిస్తాన్‌ వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్‌ 36ను ఉల్లంఘించింది. జాధవ్‌ను కలుసుకునేందుకు 3 నెలల గడువు ఎందుకు కావాలో పాక్‌ సమాధానం చెప్పాలి. జాధవ్‌ను కలుసుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులను 2017, డిసెంబర్‌ 25న పాక్‌ అనుమతించినప్పటికీ, ఆ సందర్భంగా పాక్‌ అధికారుల తీరుపై భారత్‌ నిరసన తెలియజేసింది’ అని సాల్వే వెల్లడించారు. భారత్‌ వాదనలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం పాకిస్తాన్‌ తమ వాదనల్ని ఐసీజే ముందు వినిపించనుంది.

పాక్‌ జడ్జికి గుండెపోటు
ఇస్లామాబాద్‌: అంతర్జాతీయ న్యాయస్థానంలో జాధవ్‌ కేసు విచారణ సందర్భంగా పాక్‌ తాత్కాలిక జడ్జి హుస్సేన్‌ గిల్లానీ(69)కి గుండెపోటు వచ్చింది. దీంతో అధికారులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, హుస్సేన్‌ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆర్టికల్‌ 31 ప్రకారం ఐసీజేలో విచారణ సందర్భంగా సంబంధిత దేశానికి కోర్టులో ప్రాతినిధ్యం లేకపోతే అదే దేశానికి చెందిన వ్యక్తిని ఐసీజే బెంచ్‌ తాత్కాలిక జడ్జీగా ఎంపిక చేస్తుంది. ఆ తరహాలో తాజాగా ఐసీజే హుస్సేన్‌ను తాత్కాలిక జడ్జిగా నియమించింది. దీంతో ఐసీజేలో మొత్తం జడ్జీల సంఖ్య 16కు చేరుకుంది. ఐసీజేలో సాధారణంగా 15 మంది జడ్జీలు ఉంటారు. వీరు 9 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఐసీజేలో భారత్‌ తరఫున దల్వీర్‌ భండారీ జడ్జీగా వ్యవహరిస్తున్నారు.

పాక్‌ అధికారులకు ‘నమస్కారం’
జాధవ్‌ కేసు విచారణ సందర్భంగా ఐసీజే ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌ అధికారులతో కరచాలనం చేసేందుకు భారత అధికారులు నిరాకరించారు. జాధవ్‌ కేసు విచారణ మొదలయ్యే ముందు పాక్‌ అటార్నీ జనరల్‌ అన్వర్‌ మన్సూర్‌ ఖాన్‌ భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి దీపక్‌ మిట్టల్‌తో కరచాలనం చేసేందుకు చెయ్యి చాచగా, మిట్టర్‌ నమస్కారం పెట్టారు. దీంతో ఖాన్‌ నెదర్లాండ్స్‌లో భారత రాయబారి వేణు రాజమొనితో కరచాలనం చేసేందుకు యత్నించారు. కానీ అయన కూడా నమస్కారం పెట్టి తప్పుకున్నారు. ఈ ఘటనతో ఖంగుతిన్న అన్వర్‌ ఖాన్‌.. చివరికి చేసేదేం లేక భారత మాజీ అటార్నీ జనరల్‌ హరీశ్‌ సాల్వేతో కరచాలనం చేసి తన స్థానానికి వెళ్లి కూర్చున్నారు. మరోవైపు పాక్‌ విదేశాంగ అధికార ప్రతినిధి, సార్క్‌ డైరెక్టర్‌ జనరల్‌ మొహమ్మద్‌ ఫైజల్‌కు కూడా మిట్టల్‌ నమస్కారంతోనే సరిపెట్టారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా