9/11 ఉగ్రదాడి ; కుండబద్దలుకొట్టిన సౌదీ

19 Jan, 2018 16:28 IST|Sakshi

న్యూయార్క్‌ : అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేసి, అటుపై అనేక యుద్ధాలకు కారణమైన ‘సెప్టెంబర్‌ 11 ఉగ్రదాడి’కి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒసామా బిన్‌ లాడెన్‌ నేతృత్వంలోని అల్‌కాయిదా ఉగ్రవాదులు జరిపిన దాడులతో తనకేమాత్రమూ సంబంధంలేదని సౌదీ అరేబియా తేల్చిచెప్పింది. 2001నాటి దాడుల్లో భాగం పంచుకున్న ఉగ్రవాదులకు నిధులు అందజేసినట్లు వచ్చిన ఆరోపణల్లో ఇసుమంతైనా నిజం లేదని పేర్కొంది. మాన్‌హట్టన్‌ కోర్టులో గురువారం జరిగిన విచారణలో సౌదీ తరఫు న్యాయవాది మిచెల్‌ కెల్లాగ్‌ ఈ మేరకు వాదనలు వినిపించారు.

మూలాలు సౌదీలోనే! : అల్‌కాయిదాకు సౌదీ అరేబియానుంచి పెద్ద మొత్తంలో నిధులు వెళ్లాయని, ఆ నిధులతోనే ఉగ్రవాదులు సెప్టెంబర్‌ 11 దాడులకు పాల్పడ్డారని.. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ, సీఐఏ, 9/11కమిషన్‌, 9/11 రివ్యూ కమిషన్‌లు పలు రిపోర్టుల్లో పేర్కొన్నాయి. దాడుల్లో పాల్గొన్న 19 మంది ఉగ్రవాదుల్లో అత్యధికులు సౌదీ జాతీయులేనన్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులకు నిధులందించే వారిని కూడా నిందితులుగా పేర్కొనవచ్చంటూ నాటి రిపబ్లికన్‌ ప్రభుత్వం ‘జస్టా’ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ 9/11 సంబంధిత కేసుల్లో సౌదీని కూడా నిందితురాలిగా పేర్కొంటూ పలువురు బాధితులు కోర్టుల్లో దావాలు వేశారు.

అది తప్పు.. ఒక్క ఆధారమూ లేదు: అమెరికా అధికారుల రిపోర్టుల్లోనూ సౌదీని నిందితురాలిగా పేర్కొనే ఏ ఒక్క ఆధారమూ లేదని న్యాయవాది మిచెల్‌కెల్లాంగ్‌ వాదించారు. ‘‘ఏవో కొన్ని ఊహాగానాలు, ముక్తాయింపుల ఆధారంగా నిందలు వేయడం సరికాదు. 9/11 దాడుల్లో సౌదీ పాత్ర ఉందనడానికి ఎలాంటి ఆధారాలులేవు’’ అని పేర్కొన్నారు. దాడుల అనంతరం రిపబ్లిక్‌ ప్రభుత్వం చేసిన ‘జస్టా’ చట్టాన్ని 2016లో ఒబామా వీటో చేసిన సంగతి తెలిసిందే. సౌదీ తాజా వాదనలపై బాధితులు, అమెరికా ప్రభుత్వం స్పందించాల్సిఉంది.

మరిన్ని వార్తలు