'బాంబులేస్తున్నారు.. చంపేస్తారు.. రక్షించండి'

14 Sep, 2015 09:33 IST|Sakshi
'బాంబులేస్తున్నారు.. చంపేస్తారు.. రక్షించండి'

యెమెన్: 'పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. బాంబులు వేస్తున్నారు. కచ్చితంగా చనిపోతాం. ఈలోగా దయచేసి మమ్మల్ని రక్షించండి. మేమంతా భారతీయులమే' అంటూ ఓ ఆడియో మెస్సేజ్ భారత విదేశాంగ వ్యవహారాలశాఖకు విన్నప రూపంలో వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే గుజరాత్ తీరం నుంచి వస్తు రవాణాకోసం యెమెన్ తీరానికి వెళ్లిన భారతీయులు అక్కడి ఖోఖా పోర్టు వద్ద చిక్కుకు పోయారు. వీరు తీరం చేరక ముందే యెమెన్లో బాంబుల దాడులు మొదలయ్యాయి.

ఘర్షణ వాతావరణం నెలకొంది. ముందు వెనుకా చూడకుండా వైమానిక దాడులు జరుపుతున్నారు. సరిగ్గా ఐదు పడవల్లో బయలు దేరి వెళ్లిన 70 మంది భారతీయుల పడవలు తీరం చేరుతుండగానే కొద్ది దూరంలో ఓ భారీ బాంబు పడింది. అది కొంచెం సమీపంలో పడినా వారి మృతి వార్త వినాల్సి వచ్చేది. ఈ ఘటన జరిగిన వెంటనే వారు వేగంగా తీరం చేరుకుని ఇప్పుడు నేలపై అటూఇటూ పరుగులు పెడుతున్నారు. ప్రాణాలు రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.  ఈ నేపథ్యంలో వారి దగ్గర ఉన్న ఫోన్లతో భారత్కు ఆడియో మెస్సేజ్ పంపించారు. అందులో వారి మాటలను పరిశీలిస్తే....

మేం ఇక్కడ చిక్కుకుపోయాం. ఇప్పటి వరకు మాకు ఎలాంటి సాయం దరిచేరలేదు. పరిస్థితి దారుణంగా ఉంది. మేం బోటులో ఉండగా వైమానికి బాంబు దాడులు జరిగాయి. అది కొద్ది దూరంలోపడింది కాబట్టి బతికి బయటపడ్డాం. ఈ నెల 11న మా బోట్లను ఖోఖా పోర్టు వద్ద వదిలేసి వచ్చాం. అవి ఇప్పుడు అక్కడ ఉన్నాయో లేవో తెలియదు. ప్రాణాలు రక్షించుకునేందుకు అక్కడా ఇక్కడా తిరుగుతున్నాం. మొత్తం 70మంది ఉన్నాం. మేమంతా భారతీయులమే. దయచేసి మమ్మల్ని రక్షించండి. లేదంటే వారు మమ్మల్ని చంపేస్తారు' అని అందులో ఉంది. దీనిపై భారత విదేశాంగ వ్యవహారాలశాఖ స్పందిస్తూ వారిని అక్కడి నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వారిని రక్షిస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు