ఇండియా యుద్ధ విమానం ఏమైందో తెలియదు: చైనా

24 May, 2017 16:45 IST|Sakshi
ఇండియా యుద్ధ విమానం ఏమైందో తెలియదు: చైనా

బీజింగ్‌: కనిపించకుండా పోయిన భారత​ వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌ యుద్ధ విమానం జాడ తమకు తెలియదని చైనా స్పష్టం చేసింది. భారత్‌ చెబుతున్న ప్రకారం ప్రస్తుతానికైతే తమ వద్ద దానికి సంబంధించిన సమాచారం మాత్రం లేదని పేర్కొంది.  భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌ యుద్ధ విమానం చైనా సరిహద్దులో కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. గస్తీ నిర్వహించే ఈ విమానం అసోంలోని తేజ్‌పూర్‌కు సమీపంలో మంగళవారం ఉదయం మిస్సయింది.

అందులో ఇద్దరు పైలట్‌లు ఉన్నట్లు ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు చెప్పారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో సుఖోయ్‌ టేకాఫ్‌ తీసుకుని చైనా సరిహద్దుకు సమీపంలోని దౌలాసాంగ్‌ సమీపంలో కనిపించకుండా పోయింది. చివరిసారిగా 11.30గంటల ప్రాంతంలో అస్సోంలోని తేజ్‌పూర్‌కు 60 కిలో మీటర్ల దూరంలో దీని జాడలు రికార్డయ్యాయి.

తేజ్‌పూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ చైనా సరిహద్దుకు 172 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం భారత యుద్ధ విమానం జాడ తెలియలేదు. అయితే, భారత్‌ యుద్ధ విమానానికి సంబంధించి తమకు సాధ్యమైన మేరకు సాయం చేస్తామని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లుకాంగ్‌ చెప్పారు.

>
మరిన్ని వార్తలు