బ్రిక్స్ తీర్మానంపై పాక్‌లో ప్రకంపనలు

5 Sep, 2017 19:00 IST|Sakshi
బ్రిక్స్ తీర్మానంపై పాక్‌లో ప్రకంపనలు

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదంపై కొనసాగిస్తున్న పోరులో భారత్‌కు మరో భారీ దౌత్య విజయం దక్కగా దాయాది మాత్రం దీనిపై బుసలు కొడుతోంది. ఆసియా ప్రాంతంలో హింసకు పాల్పడుతున్న తాలిబాన్, ఐసిస్, అల్‌కాయిదాతోపాటుగా హక్కానీ నెట్‌వర్క్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థల ఆగడాలను అరికట్టాలని బ్రిక్స్ సదస్సులో సోమవారం మోదీ ఇచ్చిన పిలుపు పాక్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.  శాంతికి విఘాతం కల్పిస్తున్న ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని, ఉగ్రవాద సంస్థలపై సమైక్యంగా పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీతోపాటుగా చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల అధ్యక్షులు జిన్‌పింగ్, వ్లాదిమిర్‌ పుతిన్, మైకెల్‌ టెమర్, జాకబ్‌ జుమాలు సోమవారం నిర్ణయం తీసుకున్నారు.

ఉగ్రవాదాన్ని తమ దేశం ప్రోత్సహించడని, తమపై ఆ ఐదు దేశాల అధినేతలు చేసినవి తప్పుడు ఆరోపణలంటూ పాక్ కొట్టిపారేసింది. పాక్ రక్షణమంత్రి ఖుర్రం దస్తగిర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడుతూ.. బ్రిక్స్‌లో మోదీ సహా ఐదుగురు నేతలు చెప్పినట్లుగా తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం లేదన్నారు. ఉగ్రమూకలను పాక్ ఏరిపారేస్తుందని, దానిపై ప్రత్యేక నిఘా ఉందని చెప్పారు. ఉగ్రవాదులకు ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ స్వర్గధామం కాదని మరోసారి మంత్రి ఖుర్రం  హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని ఏ దేశం హర్షించదని తమకు తెలుసునని, పాక్‌లోనూ ఉగ్రమూకలకు కష్టాలు తప్పవన్నారు.

ఉగ్రవాదుల నిమాయకం, ఉగ్ర కదలికలు, విదేశీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించటం, డ్రగ్స్‌ అక్రమ రవాణాతోపాటుగా ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరా, ఆర్థిక సాయాన్ని అడ్డుకోవటం, ఉగ్ర కేంద్రాలను ధ్వంసం చేయటం, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్టవేయటం ద్వారా ఉగ్రవాదంపై పోరాటం చేయాలని బ్రిక్స్ డిక్లరేషన్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదంపై భద్రతామండలి తీర్మానాలు, ఎఫ్‌ఏటీఎఫ్‌ అంతర్జాతీయ ప్రమాణాలు ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని అభిప్రాయపడింది. పాక్ మాత్రం తమను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని, అందులో వాస్తవం లేదని పాక్ చెప్పడం గమనార్హం.

మరిన్ని వార్తలు