ఇమ్రాన్‌ ఖాన్‌ జీతం పెంచలేదు : పాకిస్తాన్‌ పీఎంవో

31 Jan, 2020 11:41 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గత కొన్ని రోజులుగా దిగజారుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పాకిస్తాన్ కరెన్సీ విలువ క్రమంగా తగ్గిపోతోంది. గ్యాస్‌, చమురు ధరలు, విద్యుత్‌ బిల్లులు రోజురోజుకు పెరిగిపోయి సామాన్యునిపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇలాంటి తరుణంలో పాక్‌ ప్రభుత్వం ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ జీతం పెంచిందన్న వార్త అక్కడి ప్రజలకు మింగుడుపడడం లేదు. ప్రధాన మంత్రి జీతం 5,179 డార్లకు ( దాదాపు 3లక్షల 80వేల రూపాయలు)పెంచారని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

దీనిపై ఆ దేశప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారిపోతుంటే.. జీతాలు పెంచుకోవడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. కాగా, ఈ వార్తను పాక్‌ ప్రధానమంత్రి కార్యాలయం ఖండించింది. ఇమ్రాన్‌ఖాన్‌ జీతం ఒక్క రూపాయి కూడా పెంచలేదని స్పష్టం చేసింది. జీతం పెంచినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. అవి నిరాధారమైనవని కొట్టిపారేసింది. 

‘ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవాలని ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ప్రచారం చేస్తున్న సమయంలో, అటువంటి నిరాధారమైన వార్తలు ప్రచారం చేయడం దురదృష్టకరం. ప్రజలు కష్టపడి సంపాందిన డబ్బునే ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. దేశ ఆర్థిక పరిస్థితి సరిగాలేని సమయంలో ప్రజాప్రతినిధుల జీతాలను కనీస స్థాయిలో ఉంచడం తప్పనిసరి. ప్రధాని మంత్రి జీతం ఒక్కపైసా కూడా పెంచలేదు’ అని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.

దీనిపై మంత్రి మురాద్ సయీద్ మాట్లాడుతూ, దేశ ఆర్థికపరిస్థితని సరిగా లేకపోవడంతో ఇమ్రాన్‌ఖాన్ ప్రధానమంత్రి అయినప్పటీ నుంచి సొంత ఖర్చులతో ప్రైవేట్‌ నివాసంలో ఉంటున్నారని చెప్పారు. తన నివాసానికి వెళ్లే రహదారి నిర్మాణం కోసం తన జేబులో నుంచి డబ్బులు ఖర్చు చేశారన్నారు. ప్రధానమంత్రి సభల ఖర్చును 40 శాతం తగ్గించామని తెలిపారు. మంత్రులు సైతం తమ ఖర్చులను తగ్గించారన్నారు.దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న ప్రధాని ఇమ్రాన్‌పై అసత్యాలు ప్రచారం చేయడం దురదృష్టంకరం అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు