ఏ దేశమేగినా... నో ప్రాబ్లమ్!

24 Apr, 2016 14:43 IST|Sakshi
ఏ దేశమేగినా... నో ప్రాబ్లమ్!

స్విట్జర్లాండ్‌: కొత్త ప్రాంతాలకు, విదేశాలకు వెళ్లినపుడు ఎవరికైనా ఎదురయ్యే ప్రధాన సమస్య భాష. మనం చెప్పేది అవతలి వారికి అర్థం కాదు... వారికేమో స్థానిక భాష తప్పితే ఇంగ్లీషు రాదు. చాలాచోట్ల ఎంతోమందికి ఇది అనుభవంలోకి వస్తుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఫ్లోరియాన్ నాస్ట్, జార్జ్ హార్న్, స్టెఫాన్ స్ట్రీయిట్‌లకు ప్రపంచదేశాలను చుట్టి రావడం హాబీ. ఇందులో భాగంగా 2013లో వియత్నాం పర్యటనకు వెళ్లారు. అక్కడ వీరు ప్రయాణిస్తున్న బైక్ మొరాయించింది. దాన్ని రిపేర్ చేయించాలి. స్థానికులను మెకానిక్ గురించి అడిగి... వారి నుంచి సమాధానం రాబట్టడం వీరికి తలకు మించిన పనైందట.

దాంతో భాషతో పనిలేకుండా బొమ్మలతో సంభాషిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వీరికి వచ్చింది. చివరికి ఓ రెండేళ్లు తర్జనభర్జన పడి అందరికీ పనికొచ్చేలా 40 కామన్ చిహ్నాలతో ఓ టీ షర్టును రూపొందించారు. రెస్టారెంట్, లాడ్జి, బ్యాంకు, డ్రింక్, వాటర్, విమానాశ్రయం... ఇలాంటి 40 చిహ్నాలతో ఓ టీషర్టును రూపొందించారు. దాంతో వీరికి భాష సమస్య తప్పింది. ఎక్కడికెళ్లినా స్థానికులకు తమ టీ షర్టుపై ఉన్న బొమ్మను చూపించి సమాచారం అడుగుతున్నారు. అవతలి వారికి అది సులభంగా అర్థమై దారి చూపిస్తున్నారట. ఇదేదో బాగుంది కదూ... విదేశాలకు వెళ్లేటపుడు మనమూ ఇలాంటి టీషర్టు ఒకటి దగ్గర పెట్టుకుంటే సరి.

మరిన్ని వార్తలు