‘5జీ టెక్నాలజీకి.. కరోనాకి సంబంధమేలేదు’

23 Apr, 2020 16:28 IST|Sakshi

లండన్‌ : క‌రోనావైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించడంలో 5జీ సాంకేతిక పరిజ్ఞానం సాయం చేస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఐక్యరాజ్యసమితి కొట్టి పారేసింది. మొబైల్ ప్రపంచంలో 5జీ హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ టెక్నాలజీ ఓ విప్లవం లాంటిది. అయితే, ఈ 5జీ టెక్నాలజీ కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తికి కారణం అవుతోందంటూ ఇటీవల భారీగా ప్రచారం మొదలైంది. 5జీ సాంకేతిక పరిజ్ఞానం వాడకం, దీనికి సంబంధించిన తరంగాలతో మానవ వ్యాధి నిరోధక శక్తి బలహీనపడుతోందంటూ సామాజికమాధ్యమాల్లో పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. ఈ అపోహలతోనే బ్రిటన్‌లో పలు సెల్ ఫోన్ టవర్లను అక్కడి ప్రజలు ధ్వంసం చేశారు. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞాన విభాగం స్పందించింది.(5జీతో క‌రోనా దుర్మార్గ ప్ర‌చారం: బ‌్రిట‌న్‌)

కొవిడ్-19 వైరస్ వ్యాప్తికి, 5జీ సాంకేతిక పరిజ్ఞానాకి ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తికి 5జీకి సంబంధం ఉందన్న వాదనలను పుకార్లుగా కొట్టిపారేసింది. అందుకు సాంకేతికపరమైన ఆధారాలు లేవని పేర్కొంది. దీనిపై అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్స్ సంఘం అధికార ప్రతినిధి మోనికా గెహ్నర్ మాట్లాడుతూ, కరోనా వైరస్ రేడియో తరంగాల ద్వారా వ్యాపించదని, ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన నెలకొన్న వాస్తవ పరిస్థితుల్లో ఇలాంటి ప్రచారం నిజంగా సిగ్గుచేటు అని అన్నారు.(త్వరలో రిలయన్స్‌ జియో 5జీ టెక్నాలజీ)

>
మరిన్ని వార్తలు