భారతీయులకు హాంకాంగ్ షాక్!

21 Dec, 2016 09:30 IST|Sakshi
భారతీయులకు హాంకాంగ్ షాక్!
ప్రస్తుతం పర్యాటకులు ఎక్కువగా తిరిగే కాలం. భారతీయులు ఎక్కువగా వెళ్లే దేశాలు.. థాయ్‌లాండ్, హాంకాంగ్. కానీ, సరిగ్గా ఇలాంటి సమయంలోనే భారతీయ పర్యాటకులకు హాంకాంగ్ షాకిచ్చింది. ఒకవైపు థాయ్‌లాండ్ మూడు నెలల పాటు వీసా ఫీజులను సగానికి తగ్గించగా, హాంకాంగ్ మాత్రం మనోళ్లకు వీసా ఆన్ ఎరైవల్ సదుపాయాన్ని రద్దుచేసింది. 2016 డిసెంబర్ 1 నుంచి 2017 ఫిబ్రవరి 28 వరకు టూరిస్టు వీసా మీద వచ్చేవారికి వీసా ఆన్ ఎరైవల్ ఫీజును 2000 థాయ్ బాత్‌ల నుంచి వెయ్యి థాయ్‌ బాత్‌లకు తగ్గిస్తున్నట్లు రాయల్ థాయ్ కాన్సులేట్ జనరల్ ఓప్రకటనలో తెలిపింది. ఒక థాయ్ బాత్ విలువ రూ. 1.90 మాత్రమే. దాంతో వీసా ఫీజుగా సుమారు రూ. 2వేలు చెల్లిస్తే సరిపోతుంది. అదే భారతీయులకు మాత్రం మరింత వెసులుబాటు కల్పించింది. థాయ్‌లాండ్‌కు వెళ్లడానికి ముందే వీసా తీసుకుంటే కేవలం రూ. 335 వీఎఫ్ఎస్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందని చెప్పింది. 
 
అయితే హాంకాంగ్ మాత్రం.. హాంకాంగ్‌కు రావడానికి ముందే ప్రీ ఎరైవల్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. ఇదంతా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే ఫలితం వెంటనే కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అయితే దౌత్యవేత్తలు, అధికారిక పాస్‌పోర్టులు కలిగినవాళ్లకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అలాగే తరచు ఈ ఛానల్ సర్వీసు ద్వారా హాంకాంగ్‌కు వెళ్లేవారిని కూడా దీన్నుంచి మినహాయించారు. కొంతమంది భారతీయులు వీసా ఆన్ ఎరైవల్ సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
మరిన్ని వార్తలు