నో వాలెట్‌

22 Jun, 2017 03:34 IST|Sakshi
కారును పార్కింగ్‌కు తీసుకెళుతున్న రోబో

పెద్ద పెద్ద రెస్టారెంట్‌లలో, హోటళ్లలో ‘వాలెట్‌ పార్కింగ్‌’ ఉంటుంది. కారు దిగగానే వాళ్లే వచ్చి కారుని పార్కింగ్‌ ప్లేస్‌లో పెట్టేస్తారు. దీన్నే వాలెట్‌ పార్కింగ్‌ అంటారు. అయితే ఇకముందు ఆ పనిని రోబోలు చేయబోతున్నాయి. ఫొటోలో ఉన్న  రోబోను చూడండి. ఇదేం చేస్తుందో తెలుసా? షాపింగ్‌మాల్స్, ఎయిర్‌పోర్ట్‌లు, ఇతర ప్రాంతాల్లో ఆటోమేటిక్‌గా కార్లను పార్క్‌ చేస్తుంది. మాల్‌కెళితే లేదా ఎయిర్‌పోర్ట్‌కు వెళితే కారు పార్క్‌ చేసేందుకే బోలెడు సమయం పడుతుంది కదా.. పైగా ఒక్కో వాహనం ఒక్కో తీరుగా పార్క్‌ చేసి ఉండటం మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం.

ఈ చికాకులన్నింటికీ విరుగుడుగా  ఫ్రాన్స్‌కు చెందిన స్టాన్లీ రోబోటిక్స్‌ అనే సంస్థ ఈ వాలెట్‌ పార్కింగ్‌ రోబోను అభివృద్ధి చేసింది. పార్కింగ్‌ స్థలం ముఖద్వారం వద్ద మనం మన కారును వదిలేసి వచ్చేస్తే చాలు.. మిగిలిన పనంతా ఈ స్టాన్‌ రోబోనే చూసుకుంటుంది. శక్తిమంతమైన ప్లాట్‌ఫామ్‌ సాయంతో కారు చక్రాలను పైకిలేపడం.. వాహనం మొత్తాన్ని భద్రంగా ప్లాట్‌ఫామ్‌పైకి చేర్చి... ఖాళీ పార్కింగ్‌ స్థలం వరకూ మోసుకెళ్లడం.. పార్క్‌ చేసిన తరువాత ఇంకో కారును తీసుకొచ్చేందుకు వెళ్లడం ఇదీ స్టాన్‌ రోబో పనితీరు. వాహనం తాలూకూ వివరాలను స్కాన్‌ చేయడం ద్వారా మళ్లీ మన కారును మనకు తెచ్చిస్తుంది కూడా. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ విమానాశ్రయంలో ప్రస్తుతం దీన్ని పైలట్‌ పద్ధతిలో పరీక్షించి చూస్తున్నారు. ఇంకో విషయం. ఇతర వాలెట్‌ పార్కింగ్‌ల మాదిరిగా డ్రైవర్‌కు టిప్‌ ఇవ్వాల్సిన అవసరమూ ఉండదు.  – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు