నోబెల్‌ గ్రహీతకు ఎంత కష్టం..!

15 Mar, 2018 21:39 IST|Sakshi
భార్య సుమైరాతో రసాయన శాస్త్రవేత్త ఐయిచి నెగిషి(పాత ఫొటో)

చికాగో : నోబెల్‌ పురస్కార గ్రహీత, ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త ఐయిచి నెగిషి రోడ్డు ప్రమాదానికి గురై సాయం కోసం రోడ్డుపై అర్థించాల్సిన బాధకరమైన పరిస్థితి ఏర్పడింది. రోడ్డు ప్రమాదంలో ఆయన భార్య సుమైరా నెగిషి(80) దుర్మరణం చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన గంటలపాటు సాయం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. 

ఈ ఘటన అమెరికాలోని ఇల్లినాయిస్‌లో చోటు చేసుకుంది. సోమవారం ఇంటి నుంచి కారులో బయలుదేరిన నెగిషి దంపతులు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రమాదం అనంతరం ఇంటి నుంచి దాదాపు 320 కిలోమీటర్ల దూరంలో నెగిషి దంపతులను గుర్తించారు. కారు అదుపుతప్పి గుంతలోకి పడిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

సోమవారం విమానాశ్రయానికి బయలుదేరిన నెగిషి దంపతుల ఆచూకీ తెలియకుండా పోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు వృద్ధుడైన నెగిషి గాయాలతో సహాయం కోసం అర్థిస్తూ రోడ్డుపై అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు. దీంతో పోలీసులు ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. 

నెగిషి కనిపించిన ప్రదేశానికి సమీపంలోని ఓ గుంతలో వారి కారు పడిపోయి ఉంది. జపాన్‌కు  చెందిన నెగిషి 1960లో స్కాలర్‌షిప్‌పై అమెరికాకు వచ్చారు. ఇండియానాలోని పుర్డ్యూ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. కెమిస్ట్రీలో ఆయన చేసిన పరిశోధనలకు గానూ 2010లో ప్రఖ్యాత నోబెల్‌ బహుమతి ఆయన్ను వరించింది.
 

మరిన్ని వార్తలు