నోకియానుంచి త్వరలో కొత్త ఫోన్లు..

19 Aug, 2016 12:59 IST|Sakshi
నోకియానుంచి త్వరలో కొత్త ఫోన్లు..

మళ్ళీ నోకియా కొత్త బ్రాండ్ ఫోన్లు, ట్యాబ్ లు మార్కెట్లోకి రానున్నాయి. 2016 చివరినాటికి నోకియా యాండ్రాయిడ్ పవర్డ్ స్మార్ట్ ఫోన్లు విడుదల చేయనున్నట్లు ఓ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. నోకియా బ్రాండ్ హక్కులను  ఫిన్ ల్యాండ్ కు చెందిన హెచ్ఎండీ గ్లోబల్ కు విక్రయించిన అనంతరం నోకియా బ్రాండెడ్ ఫోన్లు మొదటిసారి మార్కెట్లోకి రానున్నాయి.

నోకియా ఎగ్జిక్యూటివ్ మైక్ వాంగ్ వెల్లడించిన వివరాల ప్రకారం మూడు సరికొత్త స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వీటిలో రెండు స్మార్ట్ ఫోన్లు కాగా, మరోటి టాబ్లెట్. ఈ కొత్త బ్రాండెడ్ నోకియా డివైజ్ లు 2016 చివరినాటికే ప్రారంభమైనా.. 2017 లోనే మార్కెట్లో అందుబాటులోకి వస్తాయట. 2014 లో మైక్రోసాఫ్ట్, నోకియాల మధ్య ఒప్పందాలు కుదిరిన అనంతరం.. ఇప్పటివరకూ నోకియా తన బ్రాండ్ నేమ్ తో ఎటువంటి డివైజ్ లు ప్రారంభించలేదు. అయితే గతంలో నోకియా ఫోన్లు తయారయ్యే  ప్లాంట్లలో కాక, ఈ తాజా ఫోన్లు, డివైజ్ లను కంపెనీ ఒప్పందాల ప్రకారం  ఫిన్నిష్ కంపెనీ హెచ్ఎండీ గ్లోబల్  తయారు చేస్తోంది. హెచ్ఎండీ గ్లోబల్ కు వచ్చే పదేళ్ళలో నోకియా బ్రాండెడ్ మొబైల్స్, టాబ్లెట్లు తయారు చేసేందుకు ఈ యేడాది మొదట్లోనే నోకియా..  ప్రత్యేక లైసెన్స్ మంజూరు చేసిన నేపథ్యంలో తాజాగా నోకియా ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి.

త్వరలో మార్కెట్లోకి రానున్న నోకియా ఫోన్లు.. శాంసంగ్ గెలాక్సీ ఎస్-7 ఎడ్జ్, గెలాక్సీ ఎస్-7 తరహాలో ఉంటాయని తెలుస్తోంది. 2 కె రిజల్యూషన్ (క్యూహెచ్డీ) డిస్ప్లే కలిగిన 5.2, 5.5 అంగుళాలతో,  ఐపీ68 సర్టిఫికేషన్ తో పాటు, వాటర్, డస్ట్ ప్రూఫ్ లు కలిగిన ఈ కొత్త నోకియా బ్రాండెడ్ ఫోన్లు విడుదల కానున్నట్లు జూలై నెలలోనే పుకార్లు షికార్లు చేశాయి.

>
మరిన్ని వార్తలు