కొడుకును కాపాడాలనుకుంది.. కానీ

1 Nov, 2018 11:51 IST|Sakshi

నార్త్‌ కరోలినా : అమెరికాలో బీభత్సం సృష్టించిన ఫ్లోరెన్స్‌ హారికేన్‌ దాటి నుంచి కొడుకును రక్షించుకోలేక పోయిన ఓ తల్లిపై కేసు నమోదు చేశారు పోలీసులు. తుపాను కొనసాగుతున్న సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించి చిన్నారి ప్రాణాలు తీసిందనే కారణంతో ఆమెపై అభియోగాలు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర కరోలినాలో చోటుచేసుకుంది.

వివరాలు.. ఉత్తర రోలినాకు చెందిన దజియా లీ చార్లెట్‌ అనే మహిళ తన ఏడాది కొడుకుతో పాటు అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు కారులో బయల్దేరింది. అయితే ఆ సమయంలో హారికేన్‌ ప్రభావం తీవ్రంగా ఉందని హెచ్చరించినా వినకుండా మూసి ఉన్న రహదారి గుండా కారును పోనిచ్చింది. ఈ క్రమంలో వరద ఉధృతి తీవ్రమవడంతో ఓ చోట కారును నిలిపివేసింది. అక్కడి నుంచి బయటపడే క్రమంలో తన చిన్నారిని ఎత్తుకుని కారులో నుంచి దిగింది. కానీ ప్రమాదవశాత్తు ఈ ఆ చిన్నారి వరదలో పడి కొట్టుకుపోయాడు. మరుసటి రోజు చిన్నారి శవాన్ని పోలీసులు వెలికితీశారు. సెప్టెంబరు 16న జరిగిన ఈ ఘటనలో చార్లెట్‌కు 16 నెలల శిక్ష విధించే అవకాశం ఉందని లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ యూనియన్‌ కంట్రీ షెరిఫ్‌ ఆఫీస్‌ అధికారులు పేర్కొన్నారు. (అమెరికాలో ఫ్లోరెన్స్‌ విధ్వంసం)

కాగా చార్లెట్‌పై కేసు నమోదు చేయడంపై ఆఫ్రికన్‌ అమెరికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తన బిడ్డను కాపాడుకునే క్రమంలో దురదృష్టవశాత్తు అతడు ప్రాణాలు కోల్పోతే..తప్పంతా ఆమెదేనన్నట్లు ప్రచారం చేయడం, శిక్ష పడేలా చూస్తామనడం నల్లజాతీయుల పట్ల వివక్షకు నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. బిడ్డ ప్రాణాలతో చెలగాటమాడిన ఆ మహిళకు తగిన శాస్తి జరిగిందని, అమెరికా చట్టాలు ఇటువంటి విషయాల్లో ఎవరినీ ఉపేక్షించవని మరికొందరు చార్లెట్‌ను వ్యతిరేకిస్తున్నారు.

మరిన్ని వార్తలు