కిమ్‌ వేడుకలు: అమెరికాపై బాంబు వేస్తాం

15 May, 2017 09:51 IST|Sakshi
కిమ్‌ వేడుకలు: అమెరికాపై బాంబు వేస్తాం

టోక్యో: ఉత్తరకొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఇంటర్మీడియెట్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. ఈ సందర్భంగా రాజధాని ప్యోంగ్‌యాంగ్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. త్వరలోనే అణు వార్‌హెడ్‌ను మోసుకుని అమెరికా భూభాగాన్ని చేరుకోగల సామర్ధ్యం కలిగిన క్షిపణిని తయారు చేస్తామని పేర్కొన్నారు.

ఆదివారం ఉత్తరకొరియా ఇంటర్మీడియెట్‌ రేంజ్‌ క్షిపణిని పరీక్షించింది. 2 వేల కిలోమీటర్ల ఎత్తులో 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన క్షిపణి జపాన్‌ సముద్రజలాల్లో కూలి పోయింది. దక్షిణకొరియా అధ్యక్షుడిగా మూన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం చేపట్టడం ఇదే తొలిసారి.

ఉత్తరకొరియా ప్రయోగించిన ఇంటర్మీడియెట్‌ రేంజ్‌ మిస్సైల్‌ క్రమంగా ఖండాంతర క్షిపణి తయారీకి బాటలు వేస్తుందని అమెరికా రాకెట్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత ప్రయోగాల కంటే కొన్ని రెట్ల మెరుగైన ఫలితాలు ఈ క్షిపణి ప్రయోగంతో ఉత్తరకొరియా చూసిందని తెలిపారు. కేవలం ఒక ఏడాదిలోపే ఖండాతర క్షిపణి వ్యవస్ధను ఉత్తరకొరియా చేరుకోగలదని భావిస్తున్నట్లు చెప్పారు.

ఉత్తరకొరియా క్షిపణి పరీక్షను అమెరికా, దక్షిణకొరియా, జపాన్‌లు ఖండించాయి. క్షిపణి ప్రయోగంపై ప్రకటన విడుదల చేసిన ప్యోంగ్‌యాంగ్‌ మీడియా.. దాని పేరును హ్వాసంగ్‌-12గా పేర్కొంది. అమెరికా మిలటరీ బలగాలతో తమను రెచ్చగొట్టేందుకు యత్నిస్తే గట్టిగా బదులిస్తామని ఆ దేశం హెచ్చరించింది. విపత్కర పరిణామాలు చూడాలనుకుంటే తమతో పెట్టుకోవాలని అంది.
 

మరిన్ని వార్తలు